వెయ్యి పడగలతో కాటేసే కాంగ్రెస్

ముదినేపల్లి (కృష్ణాజిల్లా) : ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వెయ్యి పడగలతో కాటేస్తుంది. సీబీఐని ఉసిగొల్పుతుంది.. కేసులు పెడుతుంది.. జైలుకైనా పంపుతుంది. ఈ కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం అంత సులువు కాదు’ అని ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఎంతో ఆవేదనతో ‌మాట్లాడారు. గత్యంతరం లేకనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డామని ఆయన పరోక్షంగా చెప్పారు. ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొనసాగుతోందీ అంటే అది ములాయం సింగ్ లాంటి నేతల వల్లే. మూడుసార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అలాంటి నేత నిన్న కాంగ్రెస్, సీబీఐల గురించి చేసిన వ్యాఖ్య ఇది. ఆయనే కాదు కేంద్రంలో ఉన్న ప్రతి ప్రతిపక్ష పార్టీ కూడా ఈ రోజు సీబీఐని విమర్శిస్తూనే ఉంది. అంతెందుకు ‘శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే ఇప్పటికే ఆయన ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయ్యేవారు’ అని ఆ పార్టీకి చెందిన కేంద్ర నాయకుడు గులాంనబీ ఆజాదే చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ మనుగడ కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తనను వ్యతిరేకించేవారిపై సీబీఐని ప్రయోగించి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల విమర్శించారు. ‘‘ఒకప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ఉన్న సీబీఐ సంస్థ ఇప్పుడు అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందించి, ఊపిరి పోసే బ్లాక్‌మెయిల్ సంస్థగా మారిపోయింద’ని నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికీ నిరసనగా శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం కృష్ణా జిల్లా గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో సాగింది. కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

చిరంజీవి, బొత్స కనిపించరా?
కేంద్ర మంత్రి చిరంజీవి సొంత వాళ్ల ఇంట్లో రూ.70 కోట్లు దొరికినా సీబీఐకి కనిపించదు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒక మాఫియా డాన్ అని, రాష్ట్రంలో 75 శాతం లిక్కర్ దుకాణాలు ఆయన బినామీలవేనని స్వయంగా ఆయన పార్టీ నేతలే చెప్తున్నా సీబీఐ ఆయన మీద విచారణ చేయదు. ప్రజా నాయకుడైన శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని జైల్లో పెట్టి ఇప్పటికే 10 నెలలైంది. ఎన్నో ఆరోపణలు చేశారు. కానీ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ‘ఈనాడు’ రూ. 100 విలువ చేసే ఒక్కో షేరును రూ. 5 లక్షలకు అమ్ముకుంటే సీబీఐకి తప్పు కనిపించదు. రూ. 10 విలువ చేసే ‘సాక్షి’ షేర్‌ను రూ.350కి అమ్ముకుంటే, సీబీఐ వాళ్లు దాన్ని క్విడ్ ప్రో కో అంటున్నారు. జగనన్నకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకుకావాలనే చార్జిషీటు వేయకుండా జాప్యం చేస్తున్నారు. ప్రాథమిక హక్కులను కూడా సీబీఐ కాలరాస్తోంది. అసలు ఇప్పుడు విచారణ జరగాల్సింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని ఎంత దుర్మార్గంగా వాడుకుంటుందీ అనే అంశం మీదనా? లేక జగన్‌మోహన్‌రెడ్డి మీదనా? ఇప్పుడు విచారణ జరగాల్సింది సీబీఐ కేంద్రం చేతిలో ఎలా కీలు బొమ్మ అయిందన్న అంశం మీదనా? లేక జగనన్న మీదనా?

మూడు నెలలకోసారి చార్జీల వాత..
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా రూ. 32 వేల కోట్ల విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల రక్తం పిండైనా వసూలు చేయాలని చూస్తున్నారు. ఈ పెంపు ఇంతటితో ఆగేది కాదు. మూడు నెలలకు ఒకసారి పెంచుతూనే పోతారట. పెంచిన విద్యుత్తు చార్జీలను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ దీక్షలు చేస్తున్నా కిరణ్‌కుమార్ రెడ్డికి కనిపించదు.. వినిపించదు.. అర్థం కాదు. ఇలాగే చంద్రబాబు నాయుడు.. కరెంటు చార్జీలు పెంచినప్పుడు వైఎస్సార్ ఏ ప్రదేశంలో కూర్చొని నిరాహార దీక్ష చేశారో.. అదే చోట ఈ రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో కలిసి నిరాహార దీక్ష చేయబట్టి ఇప్పటికి4 రోజులైంది. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డిలో ఏ చలనమూ లేదు. మనసు బండరాయి అయినప్పుడు ఎంత కదిలించి ఏం ప్రయోజనం? ఈ రోజు(శుక్రవారం) జగ్జీవన్‌రాం జయంతి.. ఈ రోజు మొదలుకొని అంబేద్కర్ జయంతి వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తోంది. కరెంటు చార్జీలు పెంచినందుకు నిరసనగా ప్రజల వద్ద నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ముందుకు వచ్చింది. ప్రజలంతా ప్రజా బ్యాలెట్‌లో పాల్గొని నిరసన తెలియజేయాలని మా ప్రార్థన.

వైయస్ ఉంటే 9 గంటల విద్యుత్తు సరఫరా అయ్యేది..
ఇవాళ వైయస్ఆర్ బతికే ఉంటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు వచ్చేది. కానీ ఈ ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే.. ఉచిత విద్యుత్తును ఎత్తి వేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, తనను వైయస్ఆర్ వారసునిగా ప్రజలు స్వాగతిస్తున్నారన్న అక్కసుతో అబద్ధపు కేసులు బనాయించి జైలులో పెట్టారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’

కిరణ్ లెక్కల గారడీ..
వైయస్ఆర్ మాటంటే మాటే.. ఇచ్చిన మాట కోసం ప్రాణంపోయినా సరే మాట పోకూడదని నిలబడేవారు. వైయస్ఆర్ రూ.2 కిలో చొప్పున ప్రతి కుటుంబానికి 20 కిలోల బియ్యం ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ప్రతి నెలా 20 కిలోలు కాకుండా 30 కిలోలు ఇస్తానని వైయస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్పష్టంగా వాగ్దానం చేశారు. దివంగత మహానేత వైయస్ఆర్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులకు, ఆయన ఇచ్చిన హామీలు మాత్రం అక్కర లేదట. ఇవాళ కిరణ్‌కుమార్‌రెడ్డి లెక్కల గారడీ చేస్తున్నారు. వైయస్ఆర్ రూ.2కు కిలో బియ్యం ఇస్తే.. నేను రూపాయికే ఇస్తున్నానని కిరణ్‌కుమార్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. మహానేత బతికే ఉంటే ఈ రోజు ప్రతి కుటుంబానికీ 30 కిలోల బియ్యం ఇచ్చేవారు. అంటే 10 కిలోల బియ్యం అదనంగా వచ్చేవి.

అప్పుడు ప్రతి కుటుంబానికీ కనీసం రూ. 300 నుంచి రూ. 400 కలిసొచ్చేది. కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.2కే కిలో బియ్యాన్ని రూపాయి చేస్తే పేదలకు కలిసొస్తుంది కేవలం రూ. 20. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు 30 కిలోల బియ్యం పథకం అమలు చేయకుండా.. ఎన్నికల సంవత్సరం ‘సరుకుల పొట్లం’ అనే పథకం పెట్టి దానిమీద సీఎం తన ఫొటోనే వేసుకొని ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? కిరణ్‌కుమార్‌రెడ్డిగారూ.. పేదలను మోసం చేసిన ఏ పార్టీ వారికైనా ఏ గతి పడుతుందో చంద్రబాబును చూసి తెలుసుకోండి.

Back to Top