వీరు మరచినా ప్రజలు మరువరు!

అనంతపురం 18 నవంబర్ 2012 : హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో దివంగత మహానేత వైయస్.రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించకపోవడం దారుణమని పలువురు వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.హంద్రీ-నీవా ప్రాజెక్టు కోసం వైయస్ సుమారు రూ. 5 వేల కోట్లు ఖర్చుపెట్టారని ఎమ్మెల్యే గురు నాథరెడ్డి, తోపుదుర్తి కవిత, శంకర్‌ నారాయణ గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనీసం మహానేత పేరును గుర్తు చేసుకోకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాజశేఖర్ రెడ్డిగారిని మరిచిపోయినా ప్రజలు మరిచిపోలేదని వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు మహానేత రాజశేఖరరెడ్డి పరితపించి జలయజ్ఞం చేపట్టి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని కలలు కన్నారన్నారు. రూ.4,800 కోట్లు కేటాయించి హంద్రీ-నీవాకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత 10 శాతం పనులు పూర్తి చేసేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇంతటి బృహత్తర పథకాన్ని చేపట్టిన వైయస్ పేరును ఆదివారం కర్నూలు జిల్లా మల్యాలలో జరిగిన పథకం మొదటిదశ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.
గురునాథరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల నీచ రాజకీయాలకిది పరాకాష్ఠ అన్నారు. రాజశేఖర్ రెడ్డిగారిని నాయకులు మరచినా...రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మరవరని స్పష్టం చేశారు. ఇందుకు ఉపఎన్నికలే ప్రత్యక్ష తార్కాణమన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేలా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని  దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో మహానేత వైఎస్ రాష్ట్ర బడ్జెట్‌లో సగం నిధులు ఇరిగేషన్ ప్రాజెక్టులకే కేటాయించారన్నారు. ఎన్టీఆర్ ఆలోచనలతో హంద్రీ-నీవా పథకానికి బీజం పడినా,  అది ఆచరణ సాధ్యం కాదని అప్పట్లో అధికారులు తేల్చి చెప్పారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు పునాదిరాళ్లు మాత్రమే వేసి ప్రజలను మభ్యపెట్టారన్నారు.  ఈ పథకాన్ని ఆచరణలోకి తెచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు.
వైయస్ఆర్‌ సీపీ అనంతపురం జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డిగారిని ప్రజల నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతోందన్నారు. అయితే ఎన్ని కుట్రలు చేసినా అది సాధ్యం కాదన్నారు. జిల్లా మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌కు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్సేనని వారు గుర్తు చేశారు. వారు కూడా మహానేత పేరు ప్రస్తావించకపోవడం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. మహానేత చలవతోనే కరువు జిల్లాకు కృష్ణా జలాలు వస్తున్నాయని, ఆ నీటితో ప్రతి గ్రామంలోనూ వైయస్ విగ్రహాలకు అభిషేకం చేయాలని రైతులు, ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ఈ రకంగానైనా ఆయన రుణం కాస్త తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు.
వైయస్ఆర్ సీపీ సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరు ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా ఉందన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు రూపకర్త వైయస్ అయితే, పేరు చెప్పుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ నేతలని విమర్శించారు. ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జిల్లా నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ వైయస్ కలలు సాకారమైన రోజున అధికార పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమన్నారు. పథకం ప్రారంభ సభలో టీడీపీ, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని గుర్తు చేసుకున్న కాంగ్రెస్ నేతలు వైయస్ పేరు మాత్రం ప్రస్తావించకపోవడాన్ని ప్రజలు క్షమించరన్నారు. రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ నాడు రాజశేఖర్ రెడ్డిని అపర భగీరథుడని పొగిడిన నోర్లు ఈ రోజు ఎందుకు మూగబోయాయని ప్రశ్నించారు. గాలేరు- నగరి, హంద్రీనీవా పథకాల అమలుకు కృషి చేసింది మహానేతేనన్నారు. ఆయన హయాంలోనే నగరి పూర్తయిందన్నారు. హంద్రీ-నీవా పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీరు ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్నారు.

తాజా వీడియోలు

Back to Top