రామచంద్రారెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ కక్షసాధింపు

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ప్రభంజనానికి తట్టుకోలేక కాంగ్రెస్, టీడీపీలు పోలీసులను ఉపయోగించుకుని అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కక్షసాధింపులకు దిగుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు. రాయదుర్గంలోని వందలాది మంది వైయస్ఆర్‌సీపీ సర్పంచ్‌లపై బైండోవర్ కేసులు పెట్టి వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి వేధించారని పద్మ నిప్పులు చెరిగారు. పోలీసుల చర్యకు నిరసనగా రామచంద్రారెడ్డి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన  సంఘటనను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఆయనపై కక్ష సాధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

పోలీసులు కాంగ్రెస్ పార్టీ, జేసీ దివాక‌ర్‌రెడ్డి జేబుల్లో ఉంటూ వారి చేతిలో పావులుగా మారిపోయారని వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే రామచంద్రారెడ్డి ఇంటిపై సోదాలు చేసి ఏవో వస్తువులు దొరికాయని కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రామచంద్రారెడ్డి కుటుంబం రాజకీయాల్లోకి రాక ముందు నుంచీ వందలాది మంది  నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించే దాతృత్వం ఉందని, అందుకు సంబంధించిన వస్తువులు వారి ఇంటిలో ఉంటే దానిని సాకుగా చేసుకుని అరెస్టు చేశారని చెప్పారు. పోలీసులను అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలు ఉపయోగించుకుంటున్న తీరును తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పద్మ చెప్పారు.

Back to Top