శ్రీకాకుళం జిల్లాకు పొంచి ఉన్న ముప్పు

శ్రీకాకుళం
జిల్లా కొవ్వాడలో అణుశక్తి కేంద్రం నిర్మిస్తే.. అక్కడ ఫుకుషిమా తరహా ప్రమాదం
సంభవించే అవకాశాలు చాలా ఎక్కువని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ఆందోళన
వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను గత సంవత్సరం డిసెంబర్ 24న
ప్రధానమంత్రికి రాసిన లేఖను ప్రస్తావించారు. కొవ్వాడలో అణుశక్తి కేంద్రాన్ని
నిర్మించడం మీద అధ్యయనం చేయడానికి, కొన్నేళ్ల క్రితం కేంద్రంలోని అణు
ఇంధన మంత్రిత్వ శాఖ ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ కొవ్వాడ చుట్టుపట్ల భూతలం
క్రింద చాలా బీటలు ఉన్నాయని, అందువలన  అక్కడ భూమి
కంపించే అవకాశాలు ఉన్నాయని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, కొవ్వాడ చుట్టూ 300
కిలోమీటర్ల వరకు క్షుణ్ణంగా ఇంకా అధ్యయనం చేయడం అవసరమని తెలిపింది. కానీ అలాంటి
పరిశీలన చేయకుండానే అక్కడ అణుశక్తి కేంద్రాన్ని నిర్మించే పనులను
ప్రారంభిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టు వచ్చిన తర్వాత.. ఒకవేళ అక్కడ పెద్దస్థాయిలో
భూకంపం వస్తే, జపాన్‌లోని ఫుకుషిమాలో జరిగిన భయంకరమైన ప్రమాదం కొవ్వాడలోనూ సంభవించే
ప్రమాదం ఉందని ఈఏఎస్ శర్మ తెలిపారు. అలాంటి ప్రమాదం సంభవిస్తే.. దాని భీభత్సం
చుట్టుపక్కల వందలాది మైళ్ల వరకు ఉంటుందన్నారు. ఆ ప్రమాదం వల్ల వచ్చే అణుధార్మిక
ప్రభావం తరతరాల మీదా ఉంటుందని హెచ్చరించారు.

అసలు
కొవ్వాడలో అణుశక్తి కేంద్రాన్ని నిర్మించడం సబబేనా అనే విషయాన్ని కుడా పునః
పరిశీలించాలని ఈఏఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరుతో, ప్రజల
జీవితాలతో చెలగాటం ఆడుకోవడం తగదని, ఈ విషయాన్ని ప్రధాని తప్పకుండా
దృష్టిలో పెట్టుకొని కొవ్వాడ అణుశక్తి కేంద్రం గురించి అణు ఇంధన మంత్రిత్వ శాఖకు
తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

 

 

Back to Top