'తుగ్లక్‌ను తలపిస్తున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి పాలన'

ఏలూరు: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి పాలన తుగ్లక్‌ను తలపిస్తోందని ఎమ్మెల్యే ఆళ్ళ నాని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్‌ తెల్లం బాలరాజు, పార్టీ సీఈసీ సభ్యుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి అల్లాడుతున్న ప్రజలపై వంటగ్యాస్, పెట్రో‌ల్, డీజిల్ భారాన్ని మోపి‌, వారి జీవనాన్ని అధోగతి పాలు చేశాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వారు ధ్వజమెత్తారు. విద్యుత్ స‌ర్‌చార్జీలే మోయలేని భారంగా ఉంటే మళ్ళీ విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం ‌ప్రయత్నించడం ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని స్పష్టం అవుతోందన్నారు.‌ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బుధవారం నిర్వహిస్తున్న విద్యుత్ ధర్నా‌ల విషయమై వారు మంగళవారంనాడు ఏలూరులో భేటీ అయ్యారు. పలు విషయాలపై చర్చించుకున్నారు. అనంతరం ఓ ప్రకటన చేశారు.

పార్టీ శ్రేణులంతా ప్రజల సహకారంతో విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని వారు‌ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. విద్యుత్ చార్జీల పెం‌పు కిరణ్ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదుసార్లు ప్రజలపై విద్యుత్ చార్జీల భా‌రం వేశారని, ఇదేం దారుణమని ప్రశ్నించిన ప్రజలపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో పోలీసు కాల్పులు జరిపించి హతమార్చారని గుర్తు చేశారు. చంద్రబాబు అనుసరించిన రాక్షస విధానాలనే కిరణ్ అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు.
Back to Top