తూ.గో. జిల్లాలోకి షర్మిల యాత్ర

రాజమండ్రి, 04 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పది జిల్లాల్లో పూర్తిచేసుకుని పదకొండో జిల్లాలోకి ప్రవేశించింది.  మంగళవారం సాయంత్రం ఆమె కొవ్వూరులోని వెంకటేశ్వర స్నానఘట్టంలో గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. శ్రీమతి షర్మిలకు స్వాగత సూచకంగానా అన్నట్టు ఆ సమయంలో భోరున వర్షం ప్రారంభమైంది. ఆ కుండపోత వర్షంలోనూ ఆమె తన యాత్రను సాగించారు. రోడ్డు, రైలు వంతెనపై అడుగుపెట్టారు.

ఆమె వెంట గోదావరి ఉరకలు వేసినట్టు అభిమానులు, పార్టీ కార్యకర్తలు జై జగన్నినాదాలతో అనుసరించారు. మరో వైపు వంతెనకు ఇరువైపులా నదిలో పడవలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలను అలంకరించుకుని ఆమెకు ఘన స్వాగతం పలికారు. మే 17, 2003న మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఇదే వంతెన మీదుగా ప్రజా ప్రస్థానం పాదయాత్రను నిర్వహిస్తూ రాజమండ్రిలో ప్రవేశించారు. ఫిబ్రవరి 8, 2011న పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డ్డి హరిత యాత్ర సందర్భంగా ఇదే దారిలో వెళ్ళారు.
తూర్పు గోదావరి జిల్లాలో శ్రీమతి షర్మిల 13 నియోజకవర్గాలలో పాదయాత్ర చేపడతారు. రాజమండ్రి, రాజానగరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, పత్తిపాడు, తుని నియోజకవర్గాలలో ఆమె యాత్ర సాగుతుంది.

మే 12వ తేదీన శ్రీమతి షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించారు. 13 నియోజకవర్గాలలో 24 రోజుల పాటు 278.3 కిలోమీటర్లు నడిచారు. రావికంపాడు వద్ద రెండు వేల కిలోమీటర్ల మైలు రాయిని ఆమె అధిగమించారు.

Back to Top