ముగ్గురు ఎమ్మెల్యేలు ఆమరణదీక్ష

కడప (వైఎస్ఆర్ జిల్లా),

15 ఆగస్టు 2013: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నిరంకుశ, ఏకపక్ష వైఖరికి వైయస్ఆర్‌ జిల్లాలో నిరసన ఉద్యమం ఉధృతం అవుతోంది. ఈ జిల్లాలోనే ముగ్గురు‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నిర్ణయానికి నిరసనగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. వైయస్ఆర్‌ ఙిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనతో పాటు కడప మాజీ మేయర్‌ పి. రవీంద్రనాథ్‌రెడ్డి, హఫీజుల్లా, ఎ. పాండురంగారెడ్డి, సంపత్‌కుమార్‌లు నిరవధిక నిరశన దీక్షలోనే ఉన్నారు. 67వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు గురువారం నుంచి వైయస్ఆర్ జిల్లా‌కే చెందిన మరో ఇద్దరు పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన అడ్డగోలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వీరంతా ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా తమ పదవులకు కొన్నాళ్ళ క్రితమే రాజీనామాలు చేశారు. వాటిని స్పీకర్‌ ఇంకా ఆమోదించలేదు.

వైయస్ఆర్‌ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి రాజంపేటలో, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రైల్వేకోడూరులో గురువారంనాడు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. కాగా ఇదే జిల్లాకు చెందిన వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాలుగవ ఎమ్మెల్యే, పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ కూడా ఈ నెల 19 నుంచి విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేయాలని నిర్ణయించారు.

రాష్ట్ర విభజన తప్పనిసరి అయితే రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌బలంగా డిమాండ్ చే‌స్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ కోసమే పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్రంలోని పలుచోట్ల ఆమరణ దీక్షకు కూర్చొని ఉద్యమానికి ఊపునిస్తున్నారు.

కాగా, మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డిల ఆరోగ్యం నాలుగవ రోజు గురువారం బాగా క్షీణించిందని వైద్యులు తెలిపారు.

Back to Top