రుణ మాఫీపై టీడీపీ స్పష్టత ఇవ్వాలి

హైదరాబాద్, 7 జూన్ 2014:

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని, తొలి సంతకం చేసే ఫైలులోనే‌ ఈ స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలుపై టీడీపీ నేతలు స్పష్టత ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తుండటాన్ని శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రమాణ స్వీకారోత్సవ సభ పేరున పేదల ఇళ్లు కూల్చడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు.

కొత్త రాజధాని నిర్మాణం కోసం ఒక వైపున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ.. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తుండటాన్ని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి కూడా తప్పుపట్టిన వైనాన్ని శ్రీకాంత్‌రెడ్డి ప్రస్తావించారు. సమంజసమైన శ్రీ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం తగదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రమోహన్‌రెడ్డి దుష్ప్రచారం చేయడం సరి కాదని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి టీడీపీ ఎంత ఖర్చు చేసిందో చంద్రబాబు ప్రమాణం చేసి చెప్పగలరా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఇచ్చిన బాధ్యత మేరకు నిజమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి వైఫల్యాన్నీ తాము ప్రజల తరఫున నిలదీస్తామన్నారు. రాష్ట్రం విడిపోయి కష్ట దశలో ఉన్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి చేస్తున్న వృథా ఖర్చులో తమ పార్టీ భాగస్వామి కాలేదన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ విచ్చలవిడిగా డబ్బును, అధికారాన్ని వినియోగించిందన్నారు.

Back to Top