పోలవరం టీడీపీ కాసులవరంగా మారింది

  • మూడున్నరేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష పార్టీపై ఎదురుదాడి
  • విదేశీ పర్యటనలతో సంపదను దుర్వినియోగం చేస్తున్న బాబు
  • పోలవరంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మల్లాది విష్ణు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు లైఫ్‌లైన్‌గా ఉన్న పోలవరం ప్రాజెక్టును టీడీపీ కాసుల వరంగా తయారు చేసిందని వైయస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు సర్కార్‌ ఇప్పుడు కాంట్రాక్టర్‌ పనులు చేయడం లేదని అబద్ధాలు మాట్లాడుతుందన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు తీర్చాలని ఉచిత విద్యుత్, జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు చేపట్టారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు సర్కార్‌ ఆ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ధనార్జనే ధ్యేయంగా కమీషన్లు మూట కట్టుకుంటుందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి లేని చంద్రబాబు విదేశీ పర్యటనలతో రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టు అంచెనాలపై వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో ప్రశ్నిస్తే రాష్ట్ర మంత్రులు దేవినేని, పరిటాల సునీత, సిద్ధా రాఘరావు, కొల్లు రవీంద్రలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పోలవరానికి సంబంధించి అక్కడ జరుగుతున్న ఎక్స్‌లేషన్, అక్రమాలు, అన్యాయాన్ని ప్రశ్నిస్తే అబద్ధాలతో కూడిన ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్ట్‌లు అడిగరని అబద్ధపు ప్రచారానికి తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోలవరం కాంగ్రెస్‌ హయాంలో రూ.5 వేల కోట్ల ఖర్చు చేస్తే టీడీపీ కాంట్రాక్టర్‌ నామా నాగేశ్వర్‌రావు కాంట్రాక్ట్‌ తీసుకొని పని చేయకుండా మూడు నాలుగు సంవత్సరాలు ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని చేజిక్కించుకొని ఏం సాధించావు చంద్రబాబు అని ప్రశ్నించారు. 2019 కల్లా పోలవరం పూర్తి చేస్తారా... లేకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగం అని చెప్పే ధైర్యం టీడీపీకి ఉందా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. 

పోలవరం ప్రాజెక్టులో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ కాంట్రాక్టు దక్కించుకుంది వాస్తవమా కాదా అని మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సుధాకర్‌ యాదవ్‌ కాంట్రాక్టు దక్కించుకుంది నిజం కాదా అని నిలదీశారు. దాదాపు 23 ప్రాజెక్టులు రూ. 3 వేల కోట్లకు సీఎం రమేష్‌ కంపెనీకి ఇచ్చారా లేదా అని విరుచుకుపడ్డారు. పోలవరం, అమరావతి, విదేశీ పర్యటనలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకొని చంద్రబాబు పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బయటపెట్టిన విషయాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top