టీడీపీ ఎంపీపీ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

హైదరాబాద్ః అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు సోమవారం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కనగానపల్లె ఎంపీపీ రాజేంద్ర, వైస్‌ ఎంపీపీ, వారి అనుచరులకు వైయస్‌ జగన్‌ పార్టీ కండువాలు వేసి సాదారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ పార్టీ కో–ఆర్డినేటర్‌ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

టీడీపీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం
తెలుగు దేశం పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెనుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీకి చెందిన ఎంపీపీ రాజేంద్ర సోమవారం వైయస్‌ఆర్‌సీపీలో చేరిన అనంతరం ప్రకాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి అనుచరులు, బంధువులదే పెత్తనమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీపీలు, సర్పంచ్‌లను పక్కన బెట్టి సునీత తన బంధువులను ఒక్కో మండలానికి ఒక్కొక ఇన్‌చార్జ్‌ను నియమించుకొని నియంత పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 

నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎంపీపీలు డమ్మీలుగా మారిపోయారన్నారు. వీరంతా కూడా బడుగు, బలహీన వర్గాలు కావడంతో మంత్రి చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనగానపల్లె మండలానికి చెందిన ఎంపీపీ రాజేంద్రను ఆ పదవి నుంచి దించేందుకు మంత్రి సునీత కుట్ర పన్నారని, అభివృద్ధికి అడ్డుపడుతుండటంతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారని తెలిపారు. నియోజకవర్గంలో లా అండ్‌ ఆర్డర్‌ కూడా సరిగా లేదని, మంత్రి చెప్పు చేతల్లో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. గతంలో ఓబులేష్‌ అనే వ్యక్తిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. టీడీపీ నేతలు తీరు మార్చుకోకపోతే ప్రజలు తిరుగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు.
 
Back to Top