వైయస్‌ఆర్‌ సీపీ సర్పంచ్‌పై టీడీపీ నేత దాడి

టీడీపీ వైఖరిపై వైయస్‌ఆర్‌ సీపీ నేతల ఫైర్‌
కూడేరుః కూడేరు మండలంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడ్డారు. కూడేరు పోలీస్‌ స్టేషన్‌ ముందు వైయస్‌ఆర్‌ సీపీ మండల ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. వారం రోజుల క్రితం జల్లిపల్లిలో సుదమ్మపై జన్మభూమి కమిటీ సభ్యులు, సర్పంచ్‌ నాగరాజు కాళ్లతో తన్ని దాడి చేసిన ఘటన మరువక ముందే మరో దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. కూడేరు మండల పరిధిలోని ఉదిరిపికొండ తాండా వైయస్‌ఆర్‌ సీపీ సర్పంచ్‌ రామ్మోహన్, అతని కుటుంబ సభ్యులపై టీడీపీ నేత రవినాయక్‌ కుట్రపూరితంగా దాడి చేశారన్నారు. రవినాయక్‌ దౌర్జన్యంగా రామ్మోహన్‌ ఇంట్లో దూరి మరీ దాడి చేశాడని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఆగడాలు, దౌర్జన్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులు వాటిని అరికట్టకపోవడం దారుణమన్నారు. ఇలాగే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మీడియా సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ జడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, నాయకులు జల్లిపల్లి దేవేంద్ర, మాదన్న, ఎంసీ ఆంజనేయులు, వన్నూరప్ప, నరేష్, నాగేంద్ర, రాఘవ తదితరులు పాల్గొన్నారు. 
 
Back to Top