పుట్టుకొస్తున్న పచ్చ కాంట్రాక్టర్లు!

పచ్చ కాంట్రాక్టర్లేమిటా అనుకుంటున్నారా..? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. వారు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తుతున్నారు. పార్టీలో ఛోటామోటా నాయకులు రేషన్‌షాపులు, ఎల్‌ఈడీ బల్బుల డీలర్లుగా మారిపోతుంటే సామాన్యకార్యకర్తలు మా సంగతేమిటని నేతలను నిలదీస్తున్నారు. దాంతో రానున్న ఖరీఫ్‌లో సాగునీరు, మురుగునీటి కాల్వల మరమ్మతులు చేయించే కాంట్రాక్టర్లుగా వారికి అవకాశమిస్తున్నారు. దాంతో గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నయా కాంట్రాక్టర్లుగా మారి హడావిడి చేస్తున్నారు. ఎలాంటి అనుభవం, అర్హతలు లేకపోయినా రు. 5లక్షల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై చేయడానికి జలవనరుల శాఖ అవకాశం కల్పించింది. ఆ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తాజాగా ఈ నామినేషన్ పనులకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. గుంటూరు జిల్లాలో సాగునీటి కాల్వల మరమ్మతులకు ప్రభుత్వం రు. 8.64 కోట్లు కేటాయించింది. జిల్లాలో సుమారు 440 పనులకు జలవనరుల శాఖ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించింది. వాటిని ఆమోదిస్తూ టెండర్లకు బదులు నామినేషన్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. కాల్వలకు నీరు విడుదల చేయడానికి రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది కనుక టెండర్లను ఆహ్వానించడం, ఖరారు చేయడం, పనులు పూర్తి చేయడం జాప్యం జరుగుతుంది కాబట్టి యూజర్ కమిటీలకు వాటిని అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ యూజర్ కమిటీలను ధృవీకరించే అధికారం మండల రెవెన్యూ (ఎమ్మార్వో)కు అప్పగించారు. ఈ యూజర్ కమిటీలలో రైతులు, వ్యవసాయ కార్మికులు ఉండాలని నిర్దేశించినా నిజానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీకి చెందిన రైతులే ఉంటున్నారు. ఈ కమిటీలకి పనులను కేటాయిస్తున్నారు. ఈ విధానంలో పనులు జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఎలాంటి అర్హతలు లేని వారికి పనులు అప్పగిస్తే వారు సక్రమంగా చేయలేరు. నాణ్యత లేని పనుల వల్ల సాగునీటి, మురుగునీటి కాల్వలు ఎలా ఉంటాయో... రైతులకు వాటివల్ల ఏం ఒరుగుతుందో వేరే చెప్పనక్కరలేదు. అవి ఎలా ఉంటేనేం... పచ్చ కాంట్రాక్టర్ల జేబులు నిండుతాయి గదా.. అదిచాలు అధికార పార్టీకి...
Back to Top