హోదా కోసం ప్రశ్నిస్తే టార్గెట్ చేస్తారా..?

  • ప్రతిపక్ష సభ్యులపై ప్రభుత్వం కక్షసాధింపు
  • హోదాకోసం ఏ శిక్షకైనా తాము సిద్ధం
  • టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదు
  • ప్రజల పక్షాన ప్రత్యేకహోదా కోసం పోరాడుతాం
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యేల స్పష్టీకరణ
హైదరాబాద్‌: ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో గళం విప్పిన వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై ఏపీ ప్రివిలేజ్‌ కమిటీ విచారణ చేపట్టింది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు ఇటీవల సభా హక్కుల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సభలో జరిగిన దానిపై వివరణ ఇచ్చేందుకు నోటీసులు అందుకున్న 12 మంది సభ్యుల్లో నలుగురు ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇవాళ సభాహక్కుల సంఘం ముందు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు హాజరు కాలేకపోతున్నామని మిగతా ఎమ్మెల్యేలు తెలిపారు.  బుధవారం ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి, బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), ఎం. సునీల్‌ కుమార్‌ (పూతలపట్టు), కంబాల జోగులు (రాజాం) అభిప్రాయాలను కమిటీ తెలసుకోనుంది. ప్రత్యేకహోదా కోసం ఉద్యమిస్తున్న ప్రతిపక్షం గొంతు నొక్కతూ టీడీపీ సభా నియమాలను మంటగల్పుతోంది. సభలో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా ప్రతిపక్ష వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలపై కక్షసాధింపుకు పాల్పడుతోంది. 

హోదా కోసం పోరాడటం తప్పా?
ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడటం తప్పా అని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రివిలేజ్‌ కమిటీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం చర్చకు అనుమతించాలని వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు సభలో శాంతియుతంగా నిరసన తెలిపారన్నారు. స్పీకర్, అసెంబ్లీ ఉద్యోగులు, మిగతా ఎమ్మెల్యేల విధులకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించలేదని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులపై కక్షగట్టి ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులు జారీ చేసిందన్నారు. నాడు సభలో జరిగిన సంఘటనపై పార్టీ సభ్యులు కమిటీ ఎదుట వివరణ ఇచ్చారన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కమిటీ నిర్ణయానికి వదిలేశామన్నారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రజాభిష్టం మేరకు తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని, ఇలాంటి బెదిరింపులకు భయపడమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

ప్రజల మాటే వేదం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని, వారి మాటే తమకు వేదమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. హోదా కోసం ఏ శిక్షకైనా సిద్ధమే అని ఆయన స్పష్టం చేశారు.  అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రివిలేజెస్‌ కమిటీ సమావేశం ఎదుట హాజరైన ఎమ్మెల్యేలు అనంతరం మీడియాతో మాట్లాడారు. శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశాన్ని చర్చించాలనే సభలో పట్టుబట్టామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రశ్నిస్తే పీడీ యాక్టులు పెడతామన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ప్రభుత్వం మమ్మల్ని టార్గెట్‌ చేసిందని మండిపడ్డారు. తమను సస్పెండ్‌ చేస్తే ఇతరులు భయపడి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయరని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉందని ఆయన అన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ సభా సాంప్రదాయలను ఉల్లంఘించలేదన్నారు. హోదా వల్లనే భవిష్యత్‌ అని లక్షలాది యువత ప్రశ్నిస్తోందని చెప్పారు. యువత కోసమే ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్నామని తెలిపారు. ప్రివిలేజ్‌ కమిటీ ఉన్నది ఎమ్మెల్యేల హక్కులను రక్షించడానికన్నారు. కానీ, ప్రత్యేక హోదా కోసం నినదించిన మమ్మల్ని శిక్షించాలని కమిటీ చూస్తోందని అని రాచముల్లు ప్రసాదరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Back to Top