టైమ్సు నౌ సర్వేకు విశ్వసనీయత లేదు: కొణతాల

హైదరాబాద్: టైమ్సు నౌ సంస్థ వెలువరించే సర్వే ఫలితాలకు విశ్వసనీయత ఉండదని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘2009 సాధారణ ఎన్నికల సందర్భంగా ఇదే టైమ్సు నౌ సంస్థ చేసిన సర్వే అవాస్తవమని రుజువైందన్నారు. అప్పట్లో మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌కు 15 ఎం.పి. సీట్లు వస్తాయని ఆ సంస్థ చెప్పిందన్నారు. కానీ 33 స్థానాల్లో విజయదుందుభి మోగించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.

ఇప్పుడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 12 స్థానాలు వస్తాయని చెబుతోందన్నారు. అంటే వారి లెక్క ప్రకారం 27 సీట్లు వస్తాయన్న మాట’ అని కొణతాల పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్ర వల్ల ఆయన గ్రాఫ్ పెరిగిందని, అందుకే 6 ఎం‌.పి. స్థానాల నుంచి 9కి పెరిగిందంటున్నారని, అలాగైతే పాదయాత్ర ఆపితే సున్నాకు పడిపోతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు 3 స్థానాలు పెరిగాయంటున్న టిడిపి నాయకులు.. 20 సీట్లు గెలవడానికి ఆయనతో 20వేల కిలోమీటర్లు నడిపిస్తారా? అని కొణతాల ఎద్దేవా చేశారు.
Back to Top