పోలవరం నిర్వాసితులకు అండగా

  • గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన సర్కార్
  • తూర్పుగోదావరి జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
  • పోలవరం ముంపు మండలాల బాధితులకు బాసట
  • నిర్వాసితులకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి
  • విలీన మండలాల్లో రెండ్రోజుల పాటు పర్యటన
తూర్పుగోదావరిః పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇంత వరకు నిర్వాసితులకు నిర్దిష్టమైన ప్యాకేజీని ఇవ్వకుండా అయోమయంలో నెట్టివేసింది. ఇంత వరకు ఏజెన్సీలో నిర్వాసితులను గానీ, కాళ్లవాపు మృతులను గానీ చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. గిరిజనుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. ఏజెన్సీ ప్రాంతంలో కాళ్లవాపుతో 12 మంది, పౌష్టికాహార లోపంతో 9 మంది శిశువులు, తల్లులు చనిపోతే టీడీపీ ప్రభుత్వంలో కనీస స్పందన లేదు. ఈ నేపథ్యంలో ముంపు మండలాల బాధితులకు భరోసా కల్పించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిర్వాసితులకు న్యాయం చేసేందుకు వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్ ఈ నెల 7, 8 తేదీల్లో రంపచోడవరం నియోజకవర్గంతో పాటు విలీనమండలాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు  పాపారాయుడు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, రాష్ట్ర ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌లతో కలిసి పరిశీలించారు.  మారేడుమిల్లిలో జగన్ బసచేసే అతిథిగృహాన్ని, రోడ్‌ షో నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. 

వైయస్ జగన్ పర్యటన సాగేదిలా.. 
జగన్ 7న ఉదయం హైదరాబాద్‌ నుంచి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి కారులో రంపచోడవరం మండలం గోపవరం వస్తారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం సీతపల్లి మీదుగా రంపచోడవరం చేరుకుని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో  దేవీపట్నం మండలానికి చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులతో ముఖాముఖీ నిర్వహిస్తారు. అనంతరం రాజవొమ్మంగి మండలంలో ఇటీవల సంభవించిన శిశు మరణాల బాధిత కుటుంబాలను రంపచోడవరంలోనే పరామర్శిస్తారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి బయలుదేరి దేవీగుడి సెంటర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు. అక్కడ నుంచి గెద్దాడ మీదుగా మారేడుమిల్లి చేరుకుని రోడ్‌ షోలో పాల్గొంటారు. రాత్రికి మారేడుమిల్లిలో బస చేస్తారు. 8న ఉదయం మారేడుమిల్లి–భద్రాచలం ఘాట్‌ రోడ్డులో ప్రయాణించి చింతూరు మీదుగా కూనవరం మండలం చేరుకొంటారు. కూనవరం బ్రిడ్జి వద్ద ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేశారు.  రేఖపల్లి చేరుకొని అక్కడ పోలవరం నిర్వాసిత రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  మాట్లాడతారు. ఆ తర్వాత ఇటీవల కాళ్లవాపు బారిన పడి మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. తిరిగి కూనవరం మీదుగా ఎటపాక మండలానికి వెళ్లి అక్కడ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి  విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్‌ చేరుకొంటారు.

Back to Top