న్యూఢిల్లీ : అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాన్ని జాతీయ పార్టీలు వ్యతిరేకించాలని, విభజన జరగకుండా అడ్డుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నేతృత్వంలోని బృందం సిపిఎం, డిఎంకె పార్టీల ప్రధాన నేతలను కలిసి కోరింది. కేవలం తెలంగాణలో కొన్ని ఎంపి సీట్లు దక్కుతాయన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ విభజన నిర్ణయం చేసిందని ఆ పార్టీల నేతల దృష్టికి తెచ్చింది. వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుల బృందం మంగళవారం ఢిల్లీలో సిపిఎం, డిఎంకె పార్టీల నేతలు ప్రకాశ్ కారత్, కనిమొళిలను కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రాలు అందజేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడానికి ముందు అసెంబ్లీ తీర్మానం తీసుకోవాలన్న సంప్రదాయాన్ని కేంద్రం తుంగలో తొక్కి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని శ్రీమతి విజయమ్మ బృందం వివరించింది. రెండు సార్లు యుపిఎ అధికారంలోకి రావడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆందోళనలను, 70 రోజులుగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా దూకుడుగా ముందుకు పోతోందని ఆవేదన వ్యక్తంచేసింది. రాష్ట్ర సమైక్యత కోసం తమ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని, తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారని ఈ బృందం కారత్, కనిమొళిల దృష్టికి తెచ్చింది. సమైక్యాంధ్రకు మద్దతుగా నిలవాలని సిపిఎం, డిఎంకెలను ఈ బృందం కోరింది. ఈ అభ్యర్థనకు ఆ రెండు పార్టీల నుంచి సానుకూల మద్దతు లభించింది. తాము ఎప్పటికీ సమైక్యానికే అండగా ఉంటామని సిపిఎం తెలుపగా, పార్లమెంట్‌లో విభజనపై చర్చ సమయంలో అన్ని అంశాలనూ గట్టిగా ప్రస్తావిస్తామని డిఎంకె హామీ ఇచ్చింది.కారత్, ఏచూరి, కనిమొళిలతో భేటీ :సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి వచ్చిన శ్రీమతి విజయమ్మ నేతృత్వంలోని బృందం మంగళవారం సిపిఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కరత్, పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరితోను, డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళితోను విడివిడిగా భేటీ అయింది. ఈ బృందంలో పార్టీ ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, మాజీ ఎం.పి. డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి, ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ హెచ్.ఎ. రెహమాన్ ఉన్నారు.ఈ భేటీల సందర్భంగా పార్టీ బృందం రాష్ట్ర విభజనపై పార్టీ వైఖరిని తెలపడంతో పాటు పలు సందర్భాల్లో సిడబ్ల్యుసి చేసిన తీర్మానాన్ని, 2009లో రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విభజనపై చెప్పిన అంశాలను, 2004లో టిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు సమయంలో జరిగిన నిర్ణయం, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ వెల్లడించిన వైఖరులను తెలుపుతూ నివేదనలను సమర్పించింది.రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి 70 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనలను శ్రీమతి విజయమ్మ బృందం ఆయా పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్ర సమైక్యతకు జాతీయ పార్టీలుగా మద్దతు అందించాలని ఆ రెండు పార్టీలకు విజ్ఞప్తి చేసింది. దీనికి ఆ రెండు పార్టీలు అంగీకారం తెలిపాయి. అన్ని అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతామని, పార్లమెంట్‌లో విభజన బిల్లు పెడితే సమైక్యాంధ్రకు మద్దతుగా నిలుస్తామని పార్టీ నేతలు హామీ ఇచ్చారు.బాబు దీక్ష ఎందుకో ప్రజలకు చెప్పాలి :టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేస్తున్న దీక్షను శ్రీమతి విజయమ్మ తప్పుపట్టారు. ‘చంద్రబాబు 2008 నుంచి విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు దీక్ష చేస్తున్నారో బాబుకే తెలియాలి’ అన్నారు. ఎవరి కోసం, ఎందు కోసం దీక్ష చేస్తున్నారో చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.