మత్యకారులకు రుణాలు, రాయితీలు

ఏలూరు :

‘నాలుగు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ కష్టాలన్నీ తీరుస్తా. మత్స్యకారులను రుణాలు, రాయితీలు ఇచ్చి అన్నివిధాలుగా ఆదుకుంటా’ అంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో హెలెన్ తుపానుతో దెబ్బతిన్న పంటలను బుధవారం ‌‌శ్రీ జగన్ పరిశీలించారు. నరసాపురం మండలం సారవలో రైతు సమస్యలను ఆయన ప్రస్తావించారు.

'నెల రోజుల వ్యవధిలో రెండు తుపాన్లు విరుచుకుపడ్డాయి. రైతులు, మత్స్యకారులను దారుణంగా దెబ్బ తీశాయి. పాలకులు, అధికారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తుపాను బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులు పూర్తిగా నష్టపోయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వానికి అసలు మనసన్నదే లేదు. తుపాను బాధితుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు.

సముద్ర తీర గ్రామమైన పెద మైనవాని లంకలో మత్స్యకారుల గురించి మాట్లాడారు. ‘గతంలో నేనీ గ్రామానికి వచ్చినప్పుడు మూడు హామీలు ఇచ్చిన విషయం నాకు గుర్తుంది. ఉప్పు మడుల్లోకి దిగి రైతులు పడుతున్న బాధలను గతంలో చూశాను. అది నాకు బాగా గుర్తుంది. అప్పుడు చెప్పినట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే ఉప్పు రైతులకు గోడౌన్లు నిర్మించి ఇస్తాం. గ్రామానికి వచ్చేందుకు ఇబ్బంది లేకుండా ఉప్పుటేరుపై బ్రిడ్జి నిర్మిస్తాం. తరచూ సముద్రపు కోతకు గురవుతున్న పెదమైనవాని లంక గ్రామాన్ని రక్షించేందుకు విశాఖ తరహాలో సముద్రపు ఒడ్డున పెద్ద బండరాళ్లతో అడ్డుకట్ట వేయిస్తాం. మత్స్యకారులకు వలలు, బోట్లతో పాటు రుణాలిప్పించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు. మత్స్యకారుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తమ ప్రభుత్వంలో నిర్వహించే రచ్చబండను పెదమైనవాని లంకలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలేవీ? :

పంట నీటిలో తడిసిపోయినా ఏ కొంచెమైనా మిగులుతుందన్న ఆశతో రైతులు పంటను కోస్తున్నారని సారవలో నష్టపోయిన రైతులను ఉద్దేశించి మాట్లాడుడూ శ్రీ జగన్‌ విచారం వ్యక్తంచేశారు. రైతులకు జరిగిన నష్టం గురించి ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బ తిన్న పంటల గురించి లెక్క కూడా రాసుకోలేదని రైతులు తనకు చెబుతున్నారన్నారు. పంట కోల్పోయి బాధలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఒక చుక్క కిరోసిన్, పది గ్రాముల బియ్యం కూడా ఇవ్వలేదని విమర్శించారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. నీలం తుపాను వచ్చి సంవత్సరం దాటినా ఇంతవరకూ చాలామంది రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడం సిగ్గుచేటని శ్రీ జగన్‌ విమర్శించారు.

ఈ ప్రభుత్వానికి మనసే లేదు :
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని శ్రీ జగన్‌ విమర్శించారు. ‘ఇప్పటికే రెండు తుపానులు వచ్చాయి. మరో తుపాను వస్తుందని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అయినా రైతుల గురించే ఆలోచించకపోవడం దారుణం’ అన్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఎలా ఆదుకోవాలో తెలుసుకునేందుకు గతంలో హుడా కమిషన్‌ను వేశారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తే. ఆయన అన్నిచోట్లా తిరిగి, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని నివేదిక ఇచ్చారు. వాళ్ల పార్టీ వ్యక్తి ఇచ్చిన నివేదిక ప్రకారం రైతులకు పరిహారమివ్వాలనే జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు’ అని విమర్శించారు.

తుపాన్లతో నష్టపోయిన ప్రతి రైతుకూ రుణ మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.10 వేల పరిహారాన్ని వెంటనే రైతులకు ఇవ్వాలన్నారు. వడ్డీ లేని రుణాలతో పాటు 75 శాతం ఇన్‌పుట్‌ సబ్సిడీతో రైతులకు విత్తనాలు ఇవ్వాలన్నారు. ఇవన్నీ రైతులకు ఇప్పించేందుకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘ఒకవేళ అప్పటికీ ఇవ్వకపోతే నాలుగు నెలలు ఓపిక పట్టండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు కచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను’ అని రైతులకు శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు.

మరో ప్రకృతి విపత్తు వస్తుందని హెచ్చరిస్తున్నా తన కోసం వేచి ఉండి ఆదరణ చూపించిన వారిని మరచిపోలేనని శ్రీ జగన్‌ అన్నారు. పర్యటనలో శ్రీ జగన్‌ వెంట వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నరసాపురం, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, తానేటి వనిత, పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్, నాయకులు కొయ్యే మోషేన్‌రాజు తదితరులున్నారు.

నీటిలో మునిగిపోయిన వరి చేల పరిశీలన :

నరసాపురం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన శ్రీ జగన్‌కు అడుగడుగునా రైతులు, మత్స్యకారులు, ప్రజలు తమ బాధలు వివరించారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం, సారవ, మోడి, తూర్పు వేములదీవి, తూర్పుతాళ్ళు, పెదమైనవాని లంక గ్రామాల్లో దెబ్బ తిన్న పంటలను, ఉప్పు మడులను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి పాలకొల్లు మండలం దిగమర్రు వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. ప్రతిచోటా జనం శ్రీ జగన్‌ను ఆపి తమ కష్టాలు వివరించడంతో పర్యటన ఆలస్యమైంది. వరి రైతులతో వారెంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వచ్చింది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వర్షపు నీళ్లలో నానుతున్న పొలాల్లోకి సైతం దిగి రైతుల సమస్యలను విన్నారు. రోడ్డుపై వరి పనలను ఆరబెట్టుకున్న రైతులను, పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, మహిళా రైతులను పలకరించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రతిచోటా తమ ఇబ్బందులు చెబుతున్న వారిని ఓదారుస్తూ, త్వరలోనే కష్టాలు తీరతాయని భరోసా ఇస్తూ ముందుకెళ్లారు. శ్రీ జగన్‌ పెదమైనవాని లంక వెళ్లేసరికే రాత్రి 7 గంటలైంది. దీంతో నరసాపురం నియోజకవర్గంలో మిగతా గ్రామాల పర్యటనను రద్దు చేసుకుని పాలకొల్లు నియోజకవర్గంలోని దిగమర్రు వెళ్లి దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అనంతరం రాత్రి 10.52 గంటలకు తాడేపల్లిగూడెం నుంచి గౌతమి ఎక్సుప్రెస్‌లో హైదరాబాద్‌ వెళ్ళారు.

Back to Top