రాజన్న సువర్ణయుగాన్ని మళ్లీ తెద్దాం

రాజమండ్రి:

‘రాముడి రాజ్యాన్ని మనం చూడలేదు కానీ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం అందరం చూశామని గర్వంగా చెప్పవచ్చు. నిజాయితీకి ప్రతిరూపం ఆ మహానేత వైయస్ఆర్. విశ్వసనీయతకు అర్థం తీసుకువచ్చిన నాయకుడు వైయస్ఆర్. ఆయన ఏనాడూ అబద్ధాలు చెప్పలేదు. ఏదైనా మాట ఇస్తే ఎంతదాకా అయినా వెళ్లేవారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగం స్ఫూర్తి ఒక‌ వైపు ఉంటే.. చంద్రబాబు రాక్షస పాలన మరోవైపు మనం చూశాం. చంద్రబాబులా అబద్ధాలు ఆడటం నాకు రాదు. చంద్రబాబు మాదిరిగా చందమామను కిందికి తీసుకువస్తానని నేను అబద్ధాలు చెప్పలేను' అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి ఆయన సోమవారం రాత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంట‌ర్‌లో జరిగిన ‘వైయస్ఆర్ జనభేరి’ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

'మరో రెండు నెలల్లో వచ్చే అన్ని ఎన్నికల్లోను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి.. మహానేత వైయస్ఆర్ కలలుగన్న సువర్ణయుగాన్ని మనమంతా ఒక్కటై కలిసికట్టుగామళ్లీ నిర్మిద్దాం’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం సాయంత్రం పర్యటన ముగించుకుని రాత్రి రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెన మీదుగా రాజమండ్రికి ఆయన చేరుకున్నారు.

ప్రజల గుండెల్లోనే కొలువైన వైయస్ఆర్ :
‘ఎన్నాళ్లు బతికామన్నది కాదు... ఎలా బతికామన్నదే ముఖ్యం.. ప్రజల గుండెల్లో ఎన్నేళ్లు నిలిచామన్నదే ముఖ్యం అని మహానేత వైయస్ఆర్ ఎప్పుడూ చెప్పేవారు. ఇంతటి ఆప్యాయత, ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీ మధ్యకు వచ్చి, రాజశేఖరరెడ్డి ఎక్కడ ఉన్నారని అడిగితే..  మీరంతా నేరుగా చేతులు గుండెలపై పెట్టి.. మా గుండె లోతుల్లో ఆ ప్రియతమ నేత బతికే ఉన్నాడని చెబుతారు. ఎందుకంటే.. అంతలా ఆయన ప్రజల కోసం బతికాడు కాబట్టి’ అని శ్రీ జగన్ గుర్తుచేసుకున్నారు. ‘మీ నాయన పుణ్యం వల్ల మేం బతికే ఉన్నామని‌ ఈ రోజు మార్గమధ్యలో ఆరేడు మంది తమ గుండెలు చూపి చెప్పారు. ఒక పేదవాడు అప్పుల పాలవకుండా లక్షలు ఖర్చయ్యే వైద్యం ఉచితంగా చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితి ఉండడానికి రాజశేఖరరెడ్డి దయే కారణం’ అని అన్నారు. ‘మీ నాయన పుణ్యమా అని మేం ఇంజనీరింగ్ చదువుతున్నాం’ అని ‌ఇంజనీరింగ్‌ విద్యార్థులు చెబుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది’ అని శ్రీ వైయస్ జగ‌న్ అన్నారు.

క్లుప్తంగా సాగిన‌ శ్రీ జగన్ ప్రసంగం‌ :
ఎన్నికల కోడ్‌ను శ్రీ జగన్ ‌అక్షరాలా పాటించారు. కోడ్ అమలులో ఉండటంతో రాత్రి పది గంటలకు ఒక్క నిమిషం ముందుగానే‌ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ప్రజలు ఇంకా మాట్లాడాలని గట్టిగా పట్టుబట్టినప్పటికీ మౌనంగా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

Back to Top