కుతంత్రాలకు సమాధి కట్టండి

కడప:

‘రాజకీయ నాయకుడంటే పేదల మనస్సు ఎరగాలి. పేదవాని మేలు కోసం తపించాలి. చనిపోయిన తర్వాత కూడా పేదల మనస్సులో చిరస్థాయిగా నిలవాలి. ఓట్లు, సీట్ల కోసం ఏ గడ్డయినా తినకూడదు. అధికారం కోసం అడ్డగోలుగా వ్యవహరించకూడదు. విశ్వసనీయత, విలువలతో ప్రజల మనస్సులు గెలవాలి. మాటపై నిలవడమే నాకు తెలుసు. చంద్రబాబు చెప్పిన అబద్ధమే వందసార్లు చెబుతారు. నేనలా అబద్ధాలు చెప్పను. రాబోయే ఎన్నికల్లో కుళ్లు కుతంత్రాలకు సమాధి కట్టండి. పేదోళ్ల రాజ్యం కోసం, రాజశేఖరుడి సువర్ణయుగం కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి’ అని వై‌యస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌ జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో ఆయన శుక్రవారంనాడు ‘వైయస్ఆర్ జనభేరి’ ఎన్నికల ప్రచార‌ం నిర్వహించారు. దీనిలో భాగంగా రోడ్డు షో నిర్వహించారు. బహిరంగ సభల్లో మాట్లాడారు.

అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళలో ప్రజలకు ఎలాంటి మేలూ చేయని చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం అడ్డదార్లు ఎంచుకుంటున్నారని అందుకోసం 'ఆల్‌ఫ్రీ బాబు'గా మారిపోతున్నారని, ఎన్నికలయ్యాక ప్రజలను వంచించాలనే ఆలోచనలో ఉన్నారని శ్రీ జగన్ విమర్శించారు.

బంగారు భవిత అందిస్తా :

‌'మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా అయ్యింది. రాష్ట్రంలో రాజశేఖరరెడ్డికి ముందు, తర్వా త అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం. పేదల మనస్సు ఎరిగి, వారి కోసం పనిచేసిన సీఎం రాజశేఖరరెడ్డిగారే అని చరిత్రలో నిలిచిపోయింది. అందుకు సాక్ష్యం ఆయన ప్రతిరూపం మీ గుండెల్లో నిలిచి ఉండడమే. అలాంటి సువర్ణ పాలన మళ్లీ అందిస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఘడియల్లోనే అదే వేదికపైనే చేసే ఐదు సంతకాలు అన్ని వర్గాలకు చేయూతగా నిలవనున్నాయి' అన్నారు.

- కరువుతో చాలా మంది అక్కాచెల్లెళ్లు బడికెళ్లాల్సిన పిల్లల్ని కూలి పనులకు తీసుకె ళ్తున్నారు. వారికొచ్చే వందతో పాటు, మరో రూ.50 వస్తే... వారం రోజులు పనికెళ్తే ఐదు రోజులు తిండికి వస్తుందని పిల్లల్ని పనులకు తీసుకెళ్తున్నారు. ఇకపై ఏ అక్కాచెల్లెమ్మ కూడా బతికేందుకు పిల్లల్ని పనులకు తీసుకెళ్లకూడదు. అందు కోసం ‘అమ్మ ఒడి’ పథకంపై తొలి సంతకం చేస్తాను. పిల్లల్ని పాఠశాలకు పంపితే ఒకరైతే రూ.500, ఇద్దరు పిల్లలైతే రూ.1000 నెలనెలా ఆ తల్లి అకౌంట్‌లో జమ చేస్తా. నాణ్యమైన విద్య కోసం అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతా.

- అవ్వతాత ల చిరునవ్వు కోసం ఓ మనవడిగా నెలనెలా రూ.700 చొప్పున పెన్షన్ అందించేందుకు రెండ‌వ సంతకం చేయబోతున్నా.
- రైతుల పంటకు గిట్టుబాటు ధరలు ఉండడంలేదు. ఆ పంటను విక్రయించాక ధరలు అమాంతం పెరుగుతున్నాయి. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ కష్టాలు తప్పించేందుకు, గిట్టుబాటు ధర కల్పించి రైతన్నల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తా. కరువు, వరదలు వచ్చినప్పుడు తక్షణమే పరిహారం అందించేందుకు రూ. 2 వేల కోట్లతో సహాయనిధి ఏర్పాటు చేస్తా. ఇందు కోసం మూడవ సంతకం చేస్తా.
- అక్కాచెల్లెమ్మలకు అండగా నిలిచేందుకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు నాలుగవ సంతకంగా డ్వాక్రా రుణాలు రద్దు చేస్తా.
- ఏ గ్రామానికి వెళ్లినా రేషన్‌కార్డు లేదని, పెన్షన్‌కార్డు లేదని, ఆధార్‌కార్డు లేదని పేదలు వాపోతున్నారు. అలాంటి వారి కోసం, ఏ కార్డయినా 24 గంటల్లో అందేలా, అధికారుల చుట్టూ తిరగకుండా ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయిస్తా. అందు కోసం ఐదవ సంతకం చేస్తా.

అందరికీ అండగా నిలుస్తా :
- ప్రతి పేదవాడికి ఇల్లు ఉండేదుకు ఐదేళ్లల్లో ఏడాదికి 10లక్షల ఇళ్లు చొప్పున 50లక్షల ఇళ్లు నిర్మిస్తా. 2019 నాటికి ఇళ్లులేని వారు చేతులు ఎత్తండి అంటే ఒక్కచేయి కూడ పైకి చూపకుండా చేస్తా. అంతేకాదు మార్జిన్ మనీ కూడ కట్టనవసరం లేదు. లక్ష వ్యయంతో ఇంటిని నిర్మించి ఆ ఇంటి పట్టాను అక్కాచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయిస్తా. ఆ పత్రాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తా.
-‌ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి పేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించారు. మూగ చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్లు చేయాలంటే రూ.6లక్షలు ఖర్చవుతుంది. అలాంటి పిల్లలకు ఏడాది వయస్సులోపే చేయించాలంటూ నిబంధనలు మార్చేశారు. అలా 133 వ్యాధులను ఆరోగ్యశ్రీ నుంచి తప్పించారు. నేను ముఖ్యమంత్రిని అయ్యాక ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తా. అన్ని వ్యాధులకు చికిత్సలు అందేలా చూస్తా. 104, 108 మరింత మెరుగైన సేవలు అందించేలా చూస్తా.

- ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన పిల్లలు మద్యం బెల్టుషాపుల వల్ల దారి తప్పుతున్నారు. ఏ గ్రామంలోనూ బెల్టుషాపు లేకుండా చేస్తా. అందు కోసం ఆ గ్రామం నుంచే మహిళా పోలీసులను ఎంపిక చేస్తాం.
- రాష్ట్రంలో వేళాపాళాలేని విద్యుత్ కోతలున్నాయి. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. 2019 నాటికి విద్యు‌త్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యు‌త్ అందిస్తా. వ్యవసాయానికి పగలు ఏడు‌ గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తా.
‌- పేదవాడికి విద్యుత్ బిల్లులు ఇప్పుడు వస్తున్నట్లుగాకుండా రూ.100లకే 150 యూనిట్లు అందేలా చూస్తాం. స‌ర్‌చార్జీల పేరుతో ఇబ్బందులు లేకుండా వ్యవహరిస్తాం.
- చదువుకున్న ప్రతి పిల్లాడికి ఉద్యోగ భద్రత కల్పిస్తా. ప్రతి తమ్ముడికి ఉద్యోగం దక్కేలా వ్యవహరిస్తాం. చంద్రబాబులా ప్రతి ఇంటికి ఉద్యోగమని నేను చెప్పను. చంద్రబాబు ఆచరణకాని హామీలతో మీ ముందుకు వస్తున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు చేయలేదని నిలదీయండి. మీ ముద్దుబిడ్డగా నన్ను ఆశీర్వదించండి.

Back to Top