అసెంబ్లీని సమూలంగా ప్రక్షాళన చేద్దాం

సత్యవేడు (చిత్తూరు జిల్లా) :

‘ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం ఓట్లు, సీట్ల కోసం కుట్రలు, కుమ్మక్కులకు వేదికగా మారిన అసెంబ్లీని సమూలంగా ప్రక్షాళన చేద్దాం. విభజన కుట్రదారులకు బుద్ధి చెబుదాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకుందాం. మన ప్రియతమ మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణయుగాన్ని తిరిగి సాధించుకుందాం’ అని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగవ విడత ఏడవ రోజు ఆదివారం నగరి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఆయన కొనసాగించారు. నగరి నియోజకవర్గంలోని నిండ్ర గ్రామంలో, సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు, నాగలాపురంలలో అశేష సంఖ్యలో ప్రజలు హాజరైన బహిరంగ సభల్లో శ్రీ జగన్ ప్రసంగించారు.

‘రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. వంట గ్యాస్ దొరకడం లేదు. ‌విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా విద్యార్థుల ఫీజు బకాయిలు అలాగే ఉన్నాయి. ‘ఆరోగ్యశ్రీ’ నుంచి 133 జబ్బులను తొలగించేశారు. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నా‌యి. బస్ చార్జీలు పెరిగిపోయా‌యి. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదు. పేదలకు కొత్తగా ఒక్క ఇందిరమ్మ ఇల్లూ లేదు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్ లేదు. ఇన్ని స‌మస్యలతో జనం సతమతం అవుతుంటే వీటిపై అసెంబ్లీలో చర్చించకుండా రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని చర్చిస్తున్న తీరు చూస్తుంటే.. ఇదేనా అసెంబ్లీ అనే బాధ కలుగుతోంది. సోనియా గీసిన గీత దాటకుండా సీఎం కిరణ్, ప్యాకేజీలు, కుమ్మక్కులతో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజల భవిష్యత్తును గాలికొదిలేశార'ని దుయ్యబట్టారు.

రాజకీయాలంటే పేదవాడి గుండెచప్పుడు వినడం. పేదవాడి ముఖంలో చిరునవ్వులు పూయించడం. ప్రజలకు మాట ఇస్తే దాని కోసం ఎందాకైనా వెళ్లే సాహసం చేయుడం. ఇదీ నాయకుడి లక్షణం. నాడు మహానేత వైయస్ఆర్ ఎర్రటి ఎండలో ప్రాణాలను ‌పణంగా పెట్టి 1,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పేదల కష్టాలను అతి దగ్గర నుంచి గమనించారు. ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యవుంత్రి కాగానే పేదలను అప్పుల ఊబిలోకి నెడుతున్న రెండు ప్రధాన సమస్యలకు పరిష్కారాలు ఆలోచించారన్నారు. పేదలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి అనారోగ్య సమస్యలు. రెండు పిల్లల చదువులు. ఈ సమస్యల పరిష్కారానికి ‘ఆరోగ్యశ్రీ’, ‘ఫీజు రీయింబర్సుమెంట్’ పథకాలను మహానేత ప్రవేశపెట్టారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికీ ఈ పథకాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. పేదల కష్టాలను తీర్చడమే నిజమైన రాజకీయంగా నమ్మి తుదివరకూ ఆయన ఆచరించారన్నారు. అందుకే వైయస్ఆర్ ‌మన నుంచి దూరమై నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ప్రజల గుండెచప్పుళ్లలో సజీవంగా ఉన్నారని అన్నారు.

విశ్వసనీయతకు అర్థం చెప్పిన వైయస్ఆర్:
రాజకీయాల్లో విశ్వసనీయుత అనే పదానికి అర్థం చెప్పిన మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ అన్నారు. రామ రాజ్యాన్ని చూడలేదు కానీ.. రాజన్న సువర్ణయుగాన్ని చూశాం అని ప్రజలు గర్వంగా చెప్పుకునే నాయకుడాయన అన్నారు. ఆయన మన నుంచి దూరమయ్యాక ప్రజలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. తన కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకు సోనియా మన రాష్ట్రాన్ని నిలువునా చీలుస్తుంటే.. ఆమె అడుగులకు మడుగులొత్తుతూ ముఖ్యవుంత్రి కిరణ్, ప్యాకేజీల కుమ్మక్కులతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. ఈ విభజన కుట్రలను మనమే ఛేదించాలి. రాష్ట్రాన్ని విభజించేందుకు పూనుకున్న సోనియా, కిరణ్, చంద్రబాబులకు తగిన బుద్ధి చెప్పాలి. మహా అయితే మరో నాలుగు నెలల్లో వైయస్ఆర్ సువర్ణయుగాన్ని తిరిగి తెచ్చుకోవాలి. ‌మనమే సొంతంగా 30 పార్లమెంటు సీట్లు సాధిద్దాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరు చేస్తారో చూద్దాం’ అని శ్రీ జగన్‌ పేర్కొన్నారు.

Back to Top