శోభకు జగన్, కుటుంబం నివాళి

ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా):

రోడ్డు ప్రమాదంలో మరణించిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి మృతదేహాన్ని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, ఆయన సోదరి శ్రీమతి షర్మిల, సతీమణి శ్రీమతి భారతీరెడ్డి శుక్రవారం సందర్శించారు. శోభా నాగిరెడ్డి మృతదేహానికి తుది నివాళులు అర్పించారు. శోభ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ముఖ్యంగా శోభ ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని ‌అక్కున చేర్చుకుని ఓదార్చారు. భూమా నాగిరెడ్డికి శ్రీ జగన్‌ ధైర్యం చెప్పారు. తమ కుటుంబానికి అత్యంత ఆప్తురాలు, తమతో అత్యంత సమీపంగా మెలగిన శోభా నాగిరెడ్డి పార్దివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి, పుష్పాంజలి ఘటించారు.

పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో ఉన్న శ్రీ జగన్, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల, శ్రీమతి భారతి తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని హైరాబాద్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్ట‌ర్‌లో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. శ్రీ జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి, సాక్షి ఎడిటోరియ‌ల్ డెరైక్ట‌ర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వచ్చారు.
‌నివాస ప్రాంగణంలో ఉంచిన శోభ భౌతికకాయానికి తొలుత శ్రీ జగన్మోహన్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు. అప్పటికే శోకసంద్రంలో మునిగి ఉన్న శోభ కుటుంబీకులు జగన్, విజయమ్మలను చూడగానే గుండెలవిసేలా విలపించారు. శోభ మృతితో పూర్తిగా డీలాపడిపోయిన భర్త భూమా నాగిరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.  శ్రీమతి విజయమ్మ పిల్లలను ‌ఓదార్చారు. ఇలాంటి సమయంలో గుండె నిబ్బరంతో వ్యవహరించాలంటూ నాగిరెడ్డికి శ్రీ జగన్ ధైర్యం చెప్పారు.‌ శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల, శ్రీమతి భారతి కంటతడిపెడుతూ శోభ తలను నిమిరినప్పుడు అక్కడున్న మహిళలు పెద్దపెట్టున రోదించారు. పది నిమిషాలకు పైగా శోభ భౌతికకాయం వద్ద ఉన్న శ్రీ జగన్, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల, శ్రీమతి భారతి తదితరులు తర్వాత భూమా నివాసంలోకి వెళ్లి శోభ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శోభ తండ్రి ఎస్‌వీ సుబ్బారెడ్డి, సోదరుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో శ్రీ జగన్ 45 నిమిషాలకు పైగా గడిపి వారికి ధైర్యం చెప్పారు.

‌శోభ లాంటి ఆత్మీయురాలిని కోల్పోవడం తనకు చాలా బాధగా ఉందని, ఆమె లేరనే వాస్తవాన్ని జీర్ణించుకుని ఇకపై జరగాల్సింది చూడాలని వారికి చెప్పారు. శోభా నాగిరెడ్డి కుటుంబానికి తన సహాయ సహకారాలు ఉంటాయని శ్రీ జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత శోభ తుదియాత్ర కోసం పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలోకి చేర్చారు. శ్రీ జగన్, శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల, శ్రీమతి భారతి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి శోభకు పుష్పాంజలి ఘటించారు.

శోభా నాగిరెడ్డి అంత్యక్రియల కార్యక్రమంలో ఆళ్లగడ్డ, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, కడప, హైదరాబాద్ ‌ప్రాంతానికి చెందిన నేతలు భారీగా హాజరయ్యారు. తమ అభిమాన నాయకురాలిని కడసారి చూసుకునేందుకు, ఆమె అంత్యక్రియలలో పాల్గొనేందుకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా వచ్చిన వారితో ఆళ్ళగడ్డ జనసంద్రంగా మారిపోయింది. 'శోభక్క అమర్‌ రహే' నినాదాలు మిన్నుముట్టాయి. పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. శోభ కుమారుడు జగత్‌ విఖ్యాతరెడ్డి బరువెక్కిన గుండెతో శాస్త్రోక్తంగా చితికి నిప్పు అంటించారు. అధికారిక లాంఛనాలతో శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు జరిగాయి.

Back to Top