శోభమ్మ మృతి మనసు కలచివేస్తోంది

నా కోసం ప్రతి అడుగులో అడుగు వేసి, ప్రతి కష్టంలోనూ మా కుటుంబానికి అండగా నిలిచిని పార్టీ నాయకురాలు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతి తన మనసు కలచివేసిందని శ్రీ వైయస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

పొన్నూరు (గుంటూరు జిల్లా):

‘శోభమ్మ నాకు సోదరిలాంటిది. నా కోసం ప్రతి అడుగులోనూ అడుగు వేసింది. అలాంటి శోభమ్మ ప్రమాద వార్త తెలిసినప్పటి నుంచీ నా మనసుకు ఎంతో కష్టంగా ఉంది. నా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని శోభమ్మను పరామర్శించడానికి వెళుతున్నా’ అని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ప్రజల వద్ద‌ గురువారంనాడు సెలవు తీసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 21 సోమవారం రాత్రి గుంటూరు జిల్లాలో ప్రవేశించారు. మంగళ, బుధవారాల్లో జిల్లాలోని తెనాలి, మంగళగిరి, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటించి పలు సభల్లో ప్రసంగించారు. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయే సమయానికి పొన్నూరు చేరుకున్నారు.

ఆ సమయానికే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభానాగిరెడ్డిని నంద్యాల ఆస్పత్రిలో చేర్పించారన్న వార్తలు వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం గురువారం ఉదయం హైదరాబాద్‌ కేర్ ఆస్పత్రికి తరలించారన్న వార్త తెలిసినప్పటి నుంచి‌ శ్రీ జగన్‌లో ఆందోళన ఎక్కువైంది. కేర్ ఆస్పత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు ఫో‌న్‌లో మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పరిస్థితి తెలుసుకుంటూ వచ్చారు.

గురువారం ఉదయానికే శ్రీ జగన్ సభ కోసం పొన్నూరు నియోజకవర్గ కేంద్రానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పొన్నూరు ప్రజలను ఉద్దేశించి చాలా క్లుప్తంగా నాలుగు నిముషాలు ప్రసంగించి హైదరాబాద్ బయలు దేరారు.

 ‘మీకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నా సోదరి శోభమ్మకు ప్రమాదం జరిగిందని తెలిసింది. ఆమె పరిస్థితి చాలా సీరియ‌స్‌గా ఉందట. నా మనసంతా కలతగా ఉంది. అందుకే నా కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆమెను పరామర్శించడానికి వెళుతున్నా. శోభమ్మ నా సోదరి లాంటిది. నా కోసం ప్రతి అడుగులోనూ అడుగు వేసి నడిచింది. ప్రతి కష్టంలోనూ మా కుటుంబానికి అండగా నిలిచింది. పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేసింది. అందుకే నేను వెంటనే బయలుదేరి వెళ్లాల్సి ఉంది. జగన్ వచ్చాడు. రెండే నిమిషాలు మాట్లాడి వెళ్లి పోయాడని ఎవ్వరూ మరోలా భావించవద్దు. జగ‌న్ మనవాడు. మనం అర్థం చేసుకోలేక పోతే ఎవరు అర్థం చేసుకుంటారన్న పెద్ద మనసుతో నన్ను దీవించి పంపండి‌' అని శ్రీ జగన్‌ కోరారు.

'మీకందరికీ ఒక విజ్ఞప్తి. మరణించి ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతి గుండెలోనూ గూడుకట్టుకుని ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో మనమంతా ఒక్కటైతేనే మళ్లీ ఆ సువర్ణయుగాన్ని సాధించుకోవడం సాధ్యమవుతుంది. పార్టీ తరఫున పొన్నూరు ఎమ్మెల్యేగా రావి వెంకటరమణను, గుంటూరు పార్లమెంటు స్థానానికి బాలశౌరిని గెలిపించా‌లని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ తన ప్రసంగాన్ని ముగించి శ్రీ జగన్ హైదరాబా‌ద్ బయలుదేరి వెళ్లారు.

 చెమర్చిన కళ్లతో అభిమానుల‌కు జగన్ పలకరింపు :
నందిగామ : శోభా నాగిరెడ్డి మృతి వార్త తెలిసి హైదరాబాద్ వెళుతున్న‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని నందిగామ 65వ నంబర్ జాతీయ రహదారిపై చందాపురం బైపా‌స్ వద్ద పలువురు వై‌యస్ఆర్‌సీపీ నాయకులు ఆపారు. ఆయన క్షణంపాటు ఆగి, శోభా నాగిరెడ్డి ఇక లేరని చెమర్చిన కళ్లతో అభిమానులను ఓదార్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు శోభా నాగిరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.‌

Back to Top