శ్రద్ధగా ఆలకించారు.. ఆదరించారు!

పుల్లూరు (మహబూబ్‌నగర్‌ జిల్లా), 22 నవంబర్‌ 2012: పుల్లూరు బహిరంగసభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేసిన ప్రసంగాలకు జనం నుంచి విశేష స్పందన లభించింది. పాలమూరు జిల్లాలోని పుల్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. విజయమ్మ, షర్మిల ప్రసంగాల్లో ఏయే సందర్భాల్లో జనం విశేషంగా స్పందించిందీ చూద్దాం...

'తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలకు, రాజశేఖరరెడ్డిగారి కోసం మరణించిన బిడ్డలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాను' అని వైయస్‌ విజయమ్మ తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని విశేష స్పందనను వ్యక్తం చేశారు. వైయస్‌ ఇక లేరని, ఇక మన మధ్యకు రారని తెలిసినప్పుడు  తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది గుండెలు ఆగిపోయాయి. మరెందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. వైయస్‌ను అంతగా ప్రేమించిన బిడ్డలను కన్న ఈ గడ్డకు తాను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను అన్నప్పడు అదే స్పందన వచ్చింది. రాజశేఖరరెడ్డిని అంతగా ప్రేమించిన ప్రతి హృదయానికి, జగన్‌బాబును ఆదరించి, అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అన్నప్పుడు జనం భారీగా స్పందించారు. తన బిడ్డ షర్మిలకు తెలంగాణలో ఎంతో ఘనంగా స్వాగతం చెప్పినందుకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అన్నప్పుడూ అదే స్పందన కనబరిచారు.

నెలకు 25 రోజులు మీ మధ్యనే ఉండి మీ సమస్యల కోసం పోరాటం చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి బయట ఉండి ఉంటే ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసి ఉండేవారన్నప్పుడు కూడా బహిరంగ సభకు హాజరైన అభిమానజనం మద్దతు పలికారు. తన బిడ్డ షర్మిల రోడ్డు మీద ఉందని, మీ అందరి ఆదరాభిమానాలు చూసి తాను ధైర్యంగా మీ చేతుల్లో పెట్టి వెళుతున్నానన్నప్పుడు ప్రజల మద్దతు విశేషంగా వచ్చింది. మన ప్రజలు తినడానికి తిండి లేకపోయినా చేతులు చాచి, నోరు తెరిచి అడగరు. అంతటి అభిమానవంతులు మన ప్రజలు అని వైయస్‌ చెప్పేవారని విజయమ్మ అన్నప్పుడు ప్రజలు తమ స్పందనను ఈలలు, కేకలతో వ్యక్తం చేశారు.

తెలంగాణకు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నప్పుడు, జగన్‌ కూడా వ్యతిరేకం కాదని విజయమ్మ చెప్పినప్పుడు జనం నుంచి అదే స్పందన లభించింది. 1259 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారని, అందులో తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ ప్రయోజనం కలిగిందన్నప్పుడు మంచి స్పందన వచ్చింది. ఉచిత విద్యుత్‌ తీసుకువచ్చినప్పడు తెలంగాణ ప్రాంతానికి భారీగా లబ్ధి కలిగిందన్నప్పుడు ప్రజలు ఈలలు, కేకలతో స్పందించారు. వైయస్‌ ప్రారంభించిన 108 అంబులెన్సుకు ఫోన్‌ చేస్తే డీజిల్‌ లేదన్న సమాధానం చెబుతున్నారన్నప్పుడూ అదే స్పందన వచ్చింది. జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలని వైయస్‌ భావించారని, శాశ్వత పరిష్కారం చేయాలని అనుకున్నారన్నప్పుడూ జనం నుంచి విశేష స్పందన లభించింది.

చంద్రబాబు నాయుడుకు ఏ కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని విజయమ్మ నిలదీసినప్పుడు బహిరంగ సభలో భారీ ఎత్తున జనం స్పందన లభించింది. చిరంజీవి తన పార్టీని హోల్‌సేల్‌గా అమ్మేశారని, మంచం కింద నోట్ల కట్టలు దొరికినా కేసులు పెట్టలేదని, చంద్రబాబు రిటెయిల్‌గా అమ్ముతున్నారన్నప్పడూ అదే స్పందన వచ్చింది. జగన్‌బాబు జైల్లో ఉన్నప్పటికీ మీరంతా ఆశీర్వదించి మొన్నటి ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడాన్ని విశ్వసనీయత అంటారన్నప్పుడూ వారు అదేవిధంగా స్పందించారు.

షర్మిలను ఆశీర్వదించేందుకు వచ్చిన మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నప్పుడూ జనం నుంచి మంచి స్పందన ఈలలు, కేకలతో లభించింది. జగన్‌బాబు త్వరలోనే మన మధ్యకు వస్తారు అని విజయమ్మ అన్నప్పుడు మంచి స్పందన సభలో వ్యక్తమైంది. విద్యార్థులను చదివించేందుకు జగన్‌ 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభిస్తారన్నప్పుడు విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ స్పందించారు. జగన్‌బాబును ఆశీర్వదించమని, వైయస్‌ నాటి సువర్ణయుగాన్ని తీసుకువస్తారని విజయమ్మ అన్నప్పుడూ అలాంటి మద్దతే వారు వ్యక్తం చేశారు.

షర్మిల ప్రసంగానికి సభలో మరింత భారీగా స్పందన:
ఇక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తరఫున మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న ఆయన సోదరి షర్మిల ఇదే వేదికపై నుంచి ప్రసంగించినప్పుడు ఆమె మాట్లాడిన ప్రతి మాటకూ జనం నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది.

రాజన్న కూతురు, జగనన్న చెల్లెలు షర్మిల మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది అని తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో అడుగుపెట్టిన తనకు స్వాగతించిన అందరికీ ధన్యవాదాలు అన్నప్పుడు సభకు హాజరైన ప్రతి ఒక్కరూ హర్షాతిరేకాలతో తమ స్పందనను వెల్లడించారు. ఉచిత విద్యుత్‌ కనెక్షన్లను ఎక్కువ శాతం తెలంగాణవారికే వైయస్‌ ఇచ్చారన్నప్పుడు వారంతా విశేషంగా స్పందించారు. తెలంగాణ అంటే నాన్నగారికి అమితమైన ప్రేమ అని, తెలంగాణ ప్రజలకు కూడా ఆయనంటే ఎనలేనంత అభిమానమని షర్మిల అన్నప్పుడు వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వైయస్‌ అకాల మరణంతో తెలంగాణలోనే అత్యధికంగా అభిమానులు అసువులుబాసారని షర్మిల గుర్తు చేసినప్పడు, అలా మరణించిన వారంతా కాంగ్రెస్‌ వారే అయినా ఆ పార్టీ ఇంతవరకూ పట్టించుకోలేదు అన్నప్పుడూ అదే స్పందన వచ్చింది. వైయస్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి, ఇప్పుడు సిగ్గు లేకుండా ఆయన మా మనిషే అంటున్నారన్నప్పుడు జనం భారీగా స్పందించారు.

చంద్రబాబు నాయుడు నిజం చెబితే తల వెయ్యి చెక్కలవుతుందని శాపం ఉందని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారని షర్మిల అన్నప్పుడు సభలో విశేష స్పందన లభించింది. పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు ఇస్తున్నఅబద్ధపు హామీల గురించి షర్మిల ప్రస్తావించినప్పుడు సభలో ఈలలు, కేకలు మిన్ను ముట్టాయి. మాట మీద చంద్రబాబు నిలబడడు అన్నప్పుడు, జగనన్నకూ, రాజన్నకూ ఉన్నది విశ్వసనీయత అన్నప్పుడు వారంతా అదేవిధంగా స్పందించారు. మీరంతా జగనన్నను కోరుకుంటున్నారంటే అది విశ్వసనీయత అని షర్మిల చెప్పినప్పుడు భారీగా స్పందన లభించింది. చేతులు అడ్డం పెట్టి సూర్యుడ్ని ఎలా ఆపలేమో అదే విధంగా జగనన్నను ఆపలేరని షర్మిల ధీమా చెప్పినప్పుడు ప్రజలు కేరింతలు కొట్టి మద్దతు ప్రకటించారు. జగనన్న రాజన్న రాజ్యం స్థాపిస్తాడన్నప్పుడు, మీరంతా జగనన్నను ఆశీర్వదించండి అన్నప్పుడు వారంతా అది విధంగా స్పందించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో 'జై.. జగన్‌' అంటూ జనం పెద్దపెట్టున నినాదాలు చేశారు.

తెలంగాణ ఉద్యమం కోసం ఎందరో బిడ్డలు తమ ప్రాణాలు కోల్పోయారని, వారంతా తన అన్నదమ్ములే అని, వారందరికీ మా సలాం అన్నప్పుడు కూడా ప్రజలు ఆమెకు మద్దతుగా స్పందించారు. 'పవిత్రమైన తెలంగాణ భూమిపై ఒట్టేసి చెబుతున్నా... జగన్‌కూ, రాజన్నకూ తెలంగాణ అంటే ప్రాణం' అన్నప్పుడు ఈ సభలో తెలంగాణ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ముక్తాయింపు:
ఒక వైపున ఈ బహిరంగ సభకు హాజరైన వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు విజయమ్మ, షర్మిల ప్రసంగాలకు పెద్ద ఎత్తున స్పందించారు. అయితే, ఇంత భారీ స్థాయిలో జనం హాజరైనా వారంతా విజయమ్మ, షర్మిల ప్రసంగాలను చాలా శ్రద్ధగా, ప్రశాంతంగా విన్నారు. నిజానికి సభలో గుండుసూది కిందపడితే శబ్దం వినిపిస్తుందన్నంతగా వారు ప్రశాంతతను పాటించడం గమనార్హం.
Back to Top