రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర పన్నారు

  • తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమే
  • జగన్ ను తొక్కేయాలని కాంగ్రెస్,టీడీపీలు కుట్ర పన్నాయి
  • సోనియా, బాబు ఇద్దరూ కుమ్మక్కై కేసులు పెట్టారు
న్యూఢిల్లీః ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్న తీరును వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ వివిధ జాతీయ పార్టీల నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా ఏకంగా వారికి మంత్రి పదవులు ఇస్తూ చంద్రబాబు ఏవిధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో జాతీయ నాయకులకు వివరిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరి మద్దతు కూడగడుతున్నారు. దీనిలో భాగంగానే నిన్న రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ జగన్ ఇవాళ ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, సీపీఐ అగ్ర నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, రాజాలను కలిశారు.  ఈ సందర్భంగా కేసుల గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వైయస్ జగన్ సూటిగా సమాధానం ఇచ్చారు. అవినీతి డబ్బులు వెదజల్లుతూ ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వైయస్ జగన్ అన్నారు. 

ఇక తనపై కేసులు కొత్తగా వచ్చినవి కాదని,  పదేళ్ల కిందటే ఎంక్వైరీ జరిగిపోయిందని చెప్పారు. తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులేనని..కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై కేసులు పెట్టారని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఎలాంటి కేసులు లేవని,   ఆయన చనిపోయాక జగన్ కాంగ్రెస్ ను ఎప్పుడైతే వదిలిపెట్టాడో అప్పుడు తనను రాజకీయంగా అణగదొక్కాలన్న కుట్రతో అధికారంలో ఉన్న సోనియాతో కలిసి బాబు కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఒక వ్యక్తి తప్పు చేసినట్లు ఇంకా రుజువు కాకపోతే మూడు నెలల కంటే ఎక్కువ కాలం జైల్లో పెట్టే అధికారం లేదని, అయినా తనను రాజకీయంగా అణగదొక్కేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టారని తెలిపారు. జగన్ కనపడకపోతే పార్టీ ఉండదని భావించి చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి ఈ కుట్ర పన్నారని అన్నారు. ఇప్పుడు వీళ్లు కొత్తగా చేయగలిగిందేమీ లేదని, పైన దేవుడున్నాడు, ప్రజలున్నారు.. అందరికీ అన్నీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
Back to Top