అవాకులు, చవాకులు వద్దు.. నిరూపించండి

గుంటూరు, 20 ఆగస్టు 2013:

శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి జైలు సౌకర్యాలపై టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు అవాకులు, చవాకులు మాని రుజువులు ఉంటే వెల్లడించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. యనమల చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె సవా‌ల్ చేశారు. లే‌కపోతే రామకృష్ణుడు టిడిపికి రాజీనామా చేస్తారా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ గుంటూరులో చేస్తున్న ఆమరణ సమరదీక్ష రెండవ రోజు మంగళవారం ఉదయం దీక్షా ప్రాంగణంలో శోభా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. యనమల మాటలు హీనస్థితికి దిగజారిపోవడానికి నిదర్శనంగా ఉన్నాయన్నారు.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష, నిరంకుశ నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ప్రజా ఉద్యమం ఉధృతంగా నడుస్తోందని శోభా నాగిరెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాలూ సంక్షేమంగా ఉండాలనే పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమర దీక్ష చే‌స్తున్నారని ఆమె వివరించారు. శ్రీమతి విజయమ్మ దీక్షకు మద్దతు తెలపడం మాటను పక్కన పెట్టి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శలు చేయటం సమంజసం కాదని శోభా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టిడిపిలు ప్రజల అగ్రహానికి గురి కాక తప్పదని ఆమె హెచ్చరించారు.

సీమాంధ్ర ప్రజలలో ఉన్న భయాందోళనలను మొట్టమొదటిసారిగా కేంద్రం దృష్టికి తీసుకువచ్చింది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని శోభా నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై ఇలాంటి నిరంకుశ నిర్ణయం తీసుకోబోతున్నదనే పార్టీ ఎమ్మెల్యేలందరం జూలై 25నే రాజీనామాలు చేశామని గుర్తుచేశారు. నిర్ణయం వచ్చిన తరువాత కాంగ్రెస్, టిడిపిలు ఊహించని విధంగా సీమాంధ్ర ప్రాంతంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ రెండు పార్టీ ప్రజాప్రతినిధులు తిరగలేని పరిస్థితిని ప్రజలు, ఉద్యోగ సంఘాలు కల్పించాయన్నారు.

ఆంటోని కమిటీ ఆంధ్రప్రదేశ్‌కు రాదన్న దిగ్విజయ్‌ మాటలపై శోభా నాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మన రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ ఈ ప్రజల పట్ల ఇంత అహంకారపూరితంగా కాంగ్రెస్‌ నాయకులు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలచుకుంటే కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీ గద్దే లేకుండా చేస్తారని హెచ్చరించారు.

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు నిజానికి నిరాహార దీక్ష చేయాల్సిందని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీమతి విజయమ్మ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తుంటే.. విమర్శలు చేయడం ఆయనకు తగదని హితవు పలికారు. సీమాంధ్ర ప్రజల దయతో సిఎం పదవిని అనుభవించిన చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చానని, దానికే కట్టుబడి ఉంటానంటూ వారికే ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీమతి విజయమ్మ దీక్షకు మద్దతు ఇవ్వకపోగా, మౌనంగానూ కూర్చోకుండా పనికిమాలిన మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.

తాజా వీడియోలు

Back to Top