సమైక్య తీర్మానం పెట్టే దమ్ము వారికి ఉందా?

ఆళ్ళగడ్డ (కర్నూలు జిల్లా),

2 అక్టోబర్ 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పిన విధంగా సమైక్యాంధ్రకు తాము అనుకూలం అని చెప్పే దమ్మూ, ధైర్యం చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణలకు ఉందా? అని పార్టీ ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే, సీఈసీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి సవాల్‌ చేశారు. సమైక్యాంధ్రకు ఎవరు ముందుగా తీర్మానం చేసినా వారికి తాను మద్దతు ఇస్తానని శ్రీ జగన్‌ పేర్కొన్న విషయాన్ని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. కాంగ్రెస్, టిడిపిలు గాని, కిరణ్, బొత్స, చంద్రబాబుల్లో ఎవరైనా గాని సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. ఎవరు తీర్మానం పెట్టినా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుందన్నారు.‌ లేదా వైయస్ఆర్ కాంగ్రెస్‌ చేస్తున్న డిమాండ్‌ మేరకు అసెంబ్లీ సమావేశమైనా పెట్టాలన్నారు. సమైక్యాంధ్రకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదెవరో, డ్రామాలాడుతున్నదెవరో అసెంబ్లీ సమావేశాల్లో తేటతెల్లం అవుతుందన్నారు. పార్టీ అధినేత శ్రీ జగన్ పిలుపు మేరకు ‌కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో ఆమె బుధవారం ఉదయం 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మాట్లాడారు.

రాష్ట్ర విభజనకు టిడిపి లేఖ ఇచ్చింది.. కాంగ్రెస్‌ పార్టీ విభజన చేసిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, పార్టీ సీఈసీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఆ రెండు పార్టీలకూ ఉందా? అని ఆమె నిలదీశారు.

బెయిల్‌ కోసం కాంగ్రెస్‌తో శ్రీ జగన్‌ డీల్‌ కుదుర్చుకుంటే.. 16 నెలల పాటు ఆయన జైలులో ఎందుకు ఉండాల్సి వస్తుందని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ట్రాన్ని విభజించాలని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటే.. దానిని వ్యతిరేకిస్తున్నది శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నిజంగా డీల్‌ కుదిరి ఉంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనే అవసరం ఆయనకు లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం శ్రీ జగన్‌, పార్టీ ప్రజాప్రతినిధులంతా పదవులకు రాజీనామాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. హైదరాబాద్‌లో 'సమైక్య శంఖారావం' మహాసభ నిర్వహిస్తామని ప్రకటించాల్సి అవసరమూ ఉండేది కాదన్నారు. చంద్రబాబు నాయుడిలా దొంగకు తేలు కుట్టినట్టు ఇంట్లో కూర్చొని ఉండవచ్చని ఎద్దేవా చేశారు.

సోనియాతో చంద్రబాబు నాయుడికే డీల్‌ కుదిరిందని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. అందుకే రాష్ట్రాన్ని విభజించాలని సోనియా నిర్ణయిస్తే.. దానికి అనుగుణంగా చంద్రబాబు బ్లాంక్‌ చెక్కులాంటి లేఖ ఇచ్చారని ఆమె దుయ్యబట్టారు. సోనియా నిర్ణయానికి అనుకూలంగా శ్రీ జగన్‌ లేఖ ఇవ్వలేదని, ఈ రోజుకూ కూడా ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. గట్టిగా పోరాడుతున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ నాయకులు కేవలం తాము ప్రజల్లోకి రావడానికి, తమను ప్రజలు అడ్డుకోకుండా ఉండడానికి శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

రెండు నెలలుగా జీతాలు లేకపోయినా.. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా ఎపి ఎన్జీవోలు మొక్కవోని ధైర్యంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడాన్ని శోభా నాగిరెడ్డి ప్రశంసించారు. అలాంటి చిత్తశుద్దితోనే రాజకీయ నాయకులు కూడా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Back to Top