సెంటు భూమి లాక్కున్నా ఊరుకోం

ఉరవకొండః తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను ప్రయివేటు పరిశ్రమలకు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ వచ్చిందని జీవితాలు బాగుపడతాయని సంతోషించే లోపే డీకే భూములంటూ ప్రయివేటు కంపెనీ కోసం ప్రజల భూములను సర్కారు లాక్కునేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన మండిపడ్డారు. ప్రజల ఆమోదాన్ని తీసుకోకుండా ఒక వేళ బలవంతంగా ప్యాక్టరీ నిర్మించాలని ప్రయత్నిస్తే పశ్చిమబెంగాల్‌లో మాదిరిగానే ఉద్యమించి వెనక్కి పంపేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా అమ్మవారిపల్లెలో బాధిత రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి మాట్లాడారు. 

ఒక్క సంవత్సరం ఓపికపట్టమని.. ఎవరూ ఆందోళనకు గురికావద్దని ప్రజలపక్షాన పోరాటం చేసేందుకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.  ఫ్యాక్టరీలు నిర్మించాలనుకుంటే చవుడు భూములు తీసుకోకుండా రైతులు సాగు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న భూములే కావాల్సి వచ్చాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవి డీకే పట్టా భూములే అయినా 70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నారని ఇవి వారికే చెందుతాయని తేల్చి చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల పేరుతో భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.  ఒకవేళ్ల భూములను బలవంతంగా లాక్కున్నా రాబోయే మన ప్రజా ప్రభుత్వంలో అందరికీ తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళనకు గురికాకుండా ఓపికతో ఉండమని సూచించారు. 

మన ఇష్టం లేకుండా వెంట్రుక కూడా పీకే సత్తా ప్రభుత్వానికి లేదని వైయస్‌ జగన్‌  ధీమా వ్యక్తం చేశారు. మీ తరఫున కోర్టుల్లో కూడా పోరాటం చేయడానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వెనకాడే ప్రసక్తే లేదని వారికి హామీ ఇచ్చారు. సెంటు భూమి లాక్కున్నా చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. అంతకముందు బాలునాయక్‌ అనే రైతుకుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శించారు. ఫ్యాక్టరీ కోసం భూములు లాక్కుంటున్నారన్న మనస్థాపంతో బాలు నాయక్‌ ఇటీవలే గుండెపోటుతో మరణించాడు. 
Back to Top