పునాది నుంచీ పార్టీని బలోపేతం చేయండి

కరీంనగర్, 30 జూన్‌ 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ని పునాది స్థాయి నుంచీ పటిష్టం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని శ్రీమతి విజయమ్మ సూచించారు. అధికార పార్టీ అరాచకాలను సమష్టిగా ఉండి సమర్ధవంతంగా ఎదుర్కోవాలని హితవు చెప్పారు.

స్థానిక సంస్థలకు నిధులు, అధికారాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదని ఆమె విమర్శించారు. ప్రజల సాధక బాధకాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడంలేదని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. పన్నుల మీద పన్నులు వేస్తూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించడంలేదన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, దానిని ఓట్లుగా మలచుకుని పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచే పార్టీ కనుక అభ్యర్థులుగా నిలబడేందుకు పోటీ ఉండవచ్చన్నారు. అయితే.. అందరూ కలిసి చర్చించుకుని సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తిచేశారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టాలని సూచించారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఎన్నికలకు వెళ్ళాలని సూచించారు. నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఫలితాలు వెలువడే వరకూ పోలింగ్‌ బూత్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలని విడిచి వెళ్ళవద్దని హెచ్చరించారు. ప్రతి పంచాయతీని గెలుచుకోవడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. బాగా పనిచేస్తారన్న విశ్వాసాన్ని ప్రజల్లో తెచ్చుకోవాలని పార్టీ శ్రేణులకు శ్రీమతి విజయమ్మ దిశా నిర్దేశం చేశారు.

‌ఎన్నికలలో పోటీ చేసేందుకు దామాషా ప్రకారం బిసిలకు టిక్కెట్లు కేటాయిద్దామని జగన్‌బాబు ప్రతిపాదనకు ఏ రాజకీయ పార్టీ సానుకూలంగా స్పందించలేదని శ్రీమతి విజయమ్మ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించుకుని బిసిలకు టిక్కెట్లు ఇవ్వాలని జగన్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

కాంగ్రెస్‌, టిడిపిలు జగన్‌బాబును అణగదొక్కాలని,‌ మహానేత వైయస్ఆర్‌ను అప్రతిష్టపాలు చేయాలన్న ఒకే ఒక్క అజెండాతో కుట్రలు చేస్తున్నాయని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు.

మహానేత వైయస్‌ఆర్‌ ఉండి ఉంటే ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్తును పూర్తిచేసి ఉండేవారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే జలయజ్ఞం పూర్తవ్వాలని ఆయన చెప్పే వారన్నారు. కరీంనగర్‌ జిల్లాకు అనేక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు తీసుకువచ్చారన్నారు. ఆరోగ్యం, విద్య, ఉపాధికి ప్రతి జిల్లాలోనూ వైయస్‌ఆర్‌ ప్రాధాన్యత ఇచ్చారని శ్రీమతి విజయమ్మ వివరించారు. కరీంనగర్‌ జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారి అభివృద్ధి కోసం అనేక పథకాల తెచ్చారన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్ళకే పింఛన్‌ ఇచ్చారన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్‌ రాజశేఖరరెడ్డిదే అన్నారు. సంతృప్త స్థాయిలో అన్ని వర్గాల వారికీ ప్రయోజనం కలిగేలా ఆయన పథకాలు అమలు చేశారన్నారు.

కానీ, వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత పథకాలన్నింటినీ నీరుగార్చుతున్నారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు ఉండని పరిస్థితి. నిత్యావసర వస్తువులు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలన్నారు. మనకు ఉపయోగపడే ప్రభుత్వానికే ఓటు వేయాలన్నారు.

ఎన్నికల సంవత్సరంలో కిరణ్‌ ప్రభుత్వం వైయస్‌ పథకాలనే పేర్లు మార్చి కొత్త పథకాలంటూ ప్రకటనలు చేస్తోందన్నారు. అయితే, ఆ పథకాల అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ‌లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని, కోట్లాది రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటూ కిరణ్‌రెడ్డి గొప్పలు చెప్పారు కాని అవి వచ్చిన జాడే లేదన్నారు. కిరణ్‌ చేతకానితనం కారణంగా రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.

చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం కుట్రలు, కుతంత్రాలే అని శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం చంద్రబాబుక అలవాటే అని దుయ్యబట్టారు. తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారిపోతారన్నారు. దేశంలోని చిన్న వ్యాపారులకు నష్టం కలుగుతుందని తెలిసి కూడా యుపిఎతో కుమ్మక్కై ఎఫ్‌డిఐలకు చంద్రబాబు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజా కంటకంగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి దించేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యత నుంచి చంద్రబాబు నిర్లజ్జగా నిర్వహించలేదని దుయ్యబట్టారు.

పలుమార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిన చంద్రబాబు వాటిని వసూలు చేయడానికి రైతులను దారుణంగా హింసించారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. బిల్లుల కోసం రైతులను జైళ్ళలో పెట్టడమే కాకుండా మహిళలని కూడా చూడకుండా వారి భార్యలను కూడా హింసించారని విచారం వ్యక్తంచేశారు. సాగునీటికి మనం ఇప్పుడు పడుతున్న ఇబ్బందుకలు చంద్రబాబు హయాంలో ఆల్మట్టి డ్యాం ఎత్తును కర్నాటక పెంచడమే అని ఆరోపించారు. ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థను నూజివీడు సీడ్సుకు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. తన హెరిటేజ్‌కు ప్రయోజనం కల్పించడం కోసం చిత్తూరు డెయిరీని మూయించేశారని నిప్పులు చెరిగారు.

మీడియాను మేనేజ్‌ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. చంద్రబాబు చేసిన అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కూడా యెల్లో మీడియా ఆహా! ఓహో! అంటూ రాయించుకున్నారని గుర్తుచేశారు. పదేళ్ళ తరువాత బయ్యారం విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. పదేళ్ళ తరువాత ఉచిత విద్యుత్‌ జ్ఞాపకం వచ్చిందా? అని నిలదీశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళతో ఏనాడైనా రుణ మాఫీ గురించి ఎందుకు ఆలోచించలేదన్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఆయన ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడుతున్నారన్నారు.

మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వం దృష్టి అంతా ఉందని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం సేవించినవారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, దౌర్జన్యాలకు, హత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో మద్యం తాగిన యువకులు కొందరు తన బిడ్డని అల్లరిపెట్టడం చూసిన తల్లి అడ్డు వెళ్లగా ఆమెని వారు హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అంతకు ముందు కరీంనగర్ చేరుకున్న‌ శ్రీమతి విజయమ్మకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఆహ్వానం పలికారు. మహిళలు బోనాలు, బతుకమ్మలు , మంగళ హారతులతో స్వాగతం పలికారు. కోర్టు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శ్రీమతి విజయమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

తాజా వీడియోలు

Back to Top