రాష్ట్రపతితో నేడు విజయమ్మ బృందం భేటి

న్యూఢిల్లీ, 9 అక్టోబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నేతృత్వంలో మంగళవారం ఢిల్లీ వచ్చిన పార్టీ నాయకుల బృందం బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటి అవుతుంది. రాష్ట్రపతి భవన్‌లో తనను ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కలిసేందుకు శ్రీమతి విజయమ్మ బృందానికి రాష్ట్రపతి భవన్‌ వర్గాలు అనుమతి ఇచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశంగా తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలని, రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలంటూ జాతీయ స్థాయి నాయకుల మద్దతు కూడగట్టేందుకు శ్రీమతి విజయమ్మ నేతృత్వంలోని వైయస్ఆర్ పార్టీ‌ బృందం మంగళవారం ఢిల్లీకి వచ్చింది. ఈ క్రమంలో నిన్న సిపిఎం, డిఎంకె నాయకులను కలుసుకుంది. ఈ రోజు రాష్ట్రపతిని కూడా కలిసి విభజన నిర్ణయంతో ఆంధ్రరాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితులను శ్రీమతి విజయమ్మ రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించనున్నారు.‌ తద్వారా ఢిల్లీ వేదికగా సమైక్యాంధ్రకు మద్దతు ప్రయత్నాలను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ముమ్మరం చేసినట్లవుతుంది.‌

రాష్ట్రపతిని కలవనున్న పార్టీ బృందంలో శ్రీమతి విజయమ్మతో పాటు ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నాయకులు డాక్టర్ ఎం‌.వి. మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, భూమా శోభా నాగిరెడ్డి, హెచ్‌ఎ రెహమాన్ ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top