రైతుల కష్టాలు తెలుసుకోడానికే వచ్చా

నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా),

31 అక్టోబర్ 2013: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ‌అమలు చేశారని, వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలు తెలుసుకోవడానికే తాను పర్యటిస్తున్నానని... ఆటంకం కలిగించవద్దని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. 90 శాతం పత్తి, మొక్కజొన్న పంటలు తెలంగాణ ప్రాంతాలోనే దెబ్బతిన్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్క తెలంగాణలోనే ఐదుగురు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం శ్రీమతి విజయమ్మ నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయే ప్రసక్తే రాదన్నారు.

మధిర, వైరా, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో గురువారం తాను వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించానని శ్రీమతి విజయమ్మ తెలిపారు. బాధలో ఉన్న రైతులను పలుకరించడానికే తాను వచ్చానన్నారు. విభజన వ్యవహారంలో తమ వైఖరి ఎప్పుడూ మారలేదని ఒక్కటిగానే ఉందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్యాంధ్రను కోరుతోందన్నారు. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే తమ పార్టీ విధానం అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు కానీ కోట్లాది మంది ప్రజల హృదయాల్లో నిండి ఉన్న ఆయనను తొలగించలేరని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఇలాంటి చర్యను విధ్వంసకుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

ఐదు రోజులుగా తాను పర్యటించిన ముంపు ప్రాంతాల్లో ప్రధానంగా వరి, ప్రత్తి, మిర్చి, మొక్కజొన్నపంటలు బాగా దెబ్బతిన్నాయని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3,37,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆమె తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం జిల్లాలో 431 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. పంటలు పాడైపోయిన దుఃఖంలో ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు గుండె పగిలి మరణించారన్నారు. వర్షాలు, వరదల వల్ల ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే మూడు వంతుల పత్తి, సుమారు 90 శాతం మొక్కజొన్న పంటలు నష్టపోయాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం మొత్తం మీద 29 లక్షల ఎకరాల్లో పంట నాశనమైందన్నారు. 45 వేల పైచిలుకు ఇళ్ళు కూలిపోయాయన్నారు. మొత్తం 53 మంది మరణించారన్నారు. 28 వేల మగ్గాలు పనికి రాకుండా పోయాయని తెలిపారు.

ఇంతకు ముందు వచ్చిన నీలం తుపానుకు సంబంధించిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇంత వరకూ అందించలేదని ప్రతి చోటా రైతులు, బాధితులు తనకు చెప్పారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ఫై లీన్‌ తుపాను వచ్చి కూడా తొమ్మిది రోజులు అవుతోందని, అయినా ఇంతవరకూ బాధితులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత నాలుగేళ్లుగా  రైతులకు ఎక్కడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. బతకడానికే కష్టంగా ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. 2010 - 13 మధ్య ఏడు వందల కోట్ల రూపాయలు పంట నష్టమని చెప్తున్న పాలకులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. వరదల్లో ఆప్తులను, కన్నబిడ్డల్లాగా పెంచుకున్న ప్రత్తి చేలను పోగొట్టుకున్న వారిని చూస్తే తనకు చాలా కష్టం అనిపించిందన్నారు. వర్షాలకు మగ్గాలు పాడైపోయి నేత పని చేసుకునే పరిస్థితి లేక చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తంచేశారు.

తుపానులు వచ్చినప్పుడు మత్స్యకారులకు 20 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్‌ ఇచ్చే ఆనవాయితీని కూడా అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీమతి విజయమ్మ దుయ్యబట్టారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులను ఈ ప్రభుత్వం అన్ని విధాలా దెబ్బతీస్తున్నదని విమర్శించారు. వ్యవసాయానికి రెండు గంటలు కూడా ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడంలేదని అన్నారు. పంటలు దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ. 10 వేలు తక్షణమే ఇవ్వాలని, రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడ‌తామన్నారు. చంద్రబాబులా తాము అబద్ధాలు చెప్పం అన్నారు.

త్వరలోనే‌ జగన్‌బాబు నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, అందరి కష్టాలు తీరుస్తారని శ్రీమతి విజయమ్మ ముంపు బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. మహానేత వైయస్ఆర్‌ నాటి సువర్ణయుగం తప్పకుండా వస్తుందని ధైర్యం చెప్పారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, శ్రీ జగన్మోహన్‌రెడ్డికి అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందడం కావాలన్నారు.

Back to Top