వైయస్‌ వల్లే హైదరాబాద్‌కు మహర్దశ

హైదరాబాద్ :

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మహానగరంగా‌ హైదరాబా‌ద్ అభివృద్ధి చెందిందని ఆయన తనయ, శ్రీ వైయస్‌ జగన్‌ సోదరి శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. నగరం చుట్టూ ఉన్న 12 శివారు మున్సిపాలిటీలను కలిపి ఆయన గ్రేటర్‌గా మార్చారని ఆమె గుర్తుచేశారు. ఔటర్ రింగ్‌రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో‌రైల్‌ లాంటి మెగా పథకాలను మహానేత వైయస్ఆర్ అమలు చేశారని‌ ఆమె గుర్తుచేశారు. నగరానికి మంచినీరు అందించే కృష్ణా రెండవ దశ ప్రాజెక్టును రికార్డు సమయంలోనే పూర్తిచేశారని, సాఫ్టువేర్‌ రంగంలో నగరాన్ని అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్సు, సనత్‌నగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఐదు చోట్ల ఆదివారం జరిగిన ‘వైయస్ఆర్ జనభేరి’ సభల్లో‌ శ్రీమతి షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలకు అభిమానజనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కానీ.. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డాబుగా ప్రచారం చేసుకుంటున్నారని శ్రీమతి షర్మిల విమర్శించారు. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూములను తన బినామీలకు చంద్రబాబు దోచిపెట్టారని ఆమె నిప్పులు చెరిగారు. ఐఎంజీకి అత్యంత చౌకగా వందలాది ఎకరాలను ఆయన ధారాదత్తం చేశారని మండిపడ్డారు.

‌విలువలు, విశ్వసనీయతకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీని బలపరచాలని ఈ సందర్భంగా ప్రజలకు శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు, పేదల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేసే వైయస్ఆర్‌సీపీ కావాలో లేక అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతున్న పార్టీలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు.

చంద్రబాబు అభినవ హిట్లర్:
‌చరిత్రలో అత్యంత దుర్మార్గుడైన హిట్ల‌ర్ పుట్టిన రోజు ఏప్రిల్ 20‌నే జన్మించిన చంద్రబాబు సరిగ్గా ఆ లక్షణాలతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. అధికార దాహం, వెన్నుపోట్లు, నమ్మక ద్రోహం, అక్రమాలు, అవినీతి, బినామి, 420 వ్యవహారాలతో బాబు అభినవ హిట్లర్‌గా అవతారమెత్తారని తూర్పారబట్టారు. లోకకల్యాణం చేస్తానంటున్న చంద్రబాబు నిజంగా చేసేది మాత్రం తన కొడుకు లోకేశ్ కల్యాణం మాత్రమేనని ఎద్దేవా చేశారు.

మహానేతకు వైయస్‌కు సాటి‌ మరవ్వరూ లేరు :
మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబ‌ర్సుమెంట్ పథకం ద్వారా చదువుకున్న లక్షలాది మంది పేద విద్యార్థులు ‌ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లయ్యారని, ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో స్థిరపడి తమ కుటుంబాలకు అండగా నిలబడ్డారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో‌ ఉచితంగా వైద్యం చేయించిన మనసున్న మనిషి వైయస్‌ఆర్ అ‌న్నారు. 108, 104 ఆరోగ్య సేవల ద్వారా పేదలను ఆపదలో ఆదుకున్న నేత వైయస్ మాత్రమే‌ అన్నారు. అభయహస్తం, పావలా వడ్డీ, ముస్లింలకు  4 శాతం రిజర్వేషన్లు సహా అనేక అద్భుత పథకాలను అమలు చేసి కోట్లాది మంది గుండెల్లో కొలువైన వైయస్‌ఆర్‌ని ఎలా మర్చిపోగలమని ఆమె ప్రశ్నించారు.

వైయస్‌ఆర్ తన ‌పాలనా కాలంలో ఒక్కసారి కూడా గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచని వైనాన్ని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు. కానీ చంద్రబాబు, ఇటీవలి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక‌సార్లు ధరలు పెంచి పేదల నడ్డి విరిచిందని ఆరోపించారు. వైయస్‌ఆర్ మరణం తర్వాత సీ‌ల్డుకవర్‌లో ఊడిపడిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్టాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారన్నారు. కాంగ్రెస్ పాలకులు పన్నుల రూపంలో ప్రజలపై రూ. 32 వేల కోట్ల‌ భారం వేశారని విమర్శించారు. తప్పుడు  కేసులు బనాయించి జగనన్నను జైల్లో పెట్టారని మండిపడ్డారు. బోనులో ఉన్నా సింహం సింహమే అని ప్రజల హర్షాతిరేకాల మధ్య అన్నారు.

అబద్ధాలు ప్రచారం చేయడంలో చంద్రబాబు నాయుడు గోబెల్సును మించిపోయారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. తనకు వంత పాడుతున్న యెల్లో మీడియాలో భాగమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల సహకారంతో ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, తానే ముఖ్యమంత్రి అవుతానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేత‌లకు మానవత్వం లేదు :
వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే ఐదేళ్ళుగా ప్రజా సమస్యలపై స్పందించిందని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. వైయస్ఆర్, పీజేఆర్‌లను హైదరాబాద్‌ నగరవాసులు ఇప్పటికీ తమ దేవుడిలా కొలుస్తున్నారని గుర్తుచేశారు. వైయస్ఆర్ బతికున్నంత కాలం‌ ఇంద్రుడు, భగీరథుడు అని పొగిడిన వాళ్లే ఆయన మరణించాక ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చితే కిమ్మనకుండా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ నేతలకు ఇంగితజ్ఞానం, మానవత్వం లేకుండా పోయాయని ఆమె మండిపడ్డారు.

ముస్లింల కోసం కోర్టులో పోరాడి మరీ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్ఆర్‌కే దక్కుతుందన్నారు. ఆ మహానేత ఆశయాలను వైయస్ఆర్‌సీపీ కొనసాగిస్తోందని, సికింద్రాబాద్ పార్లమెంటరీ  స్థానంతో పాటు 12 మంది ముస్లింలకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ మాత్రమే టికెట్లు ఇచ్చిందన్నారు.

‌చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డట్లు అవుతుందని శ్రీమతి షర్మిల ఓటర్లను హెచ్చరించారు. చంద్రబాబును మించిన సైకో లేడని, ఏడాదికోసారి విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత ఆయనదేనని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు.

ప్రజల పక్షాన చంద్రబాబు నిలవకపోవడంతో ప్రతిపక్షం బాధ్యతను జగనన్న తీసుకున్నారని చెప్పారు. ‘ఫీజు రీయింబర్సుమెంట్ కోసం జగ‌నన్న వారం రోజులు దీక్ష చేశారని గుర్తుచేశారు. రైతులు, చేనేత కార్మికుల సమస్యలపై, ధరల తగ్గింపు కోసం నిరాహార దీక్షలు చేశారు. ఓదార్పు కోసం పదవులను వదులుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, రాజన్న రాజ్యం కోసం వైయస్ఆర్‌సీపీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

Back to Top