'రాజన్నరాజ్యం'లో అన్ని వర్గాలకూ ఆసరా

పాలకొండ (శ్రీకాకుళం జిల్లా),

23 జూలై 2013: అన్ని వర్గాల ప్రజలకు మేలు కలగాలని మహానేత వైయస్ఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు ఇవ్వడమే కాకుండా మద్దతు ధర కూడా కల్పించారన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడమే కాకుండా నష్టపరిహారమూ అందించారన్నారు. విద్యుత్‌ బకాయిలు మాఫీ చేశారని, రైతుల రుణాలపై ఉన్న వడ్డీని మాఫీ చేశారని శ్రీమతి షర్మిల తెలిపానారు. రూ. 12 వేల కోట్లతో రైతుల రుణ మాఫీ చేసిన ఘనత కూడా వైయస్‌దే అన్నారు. రైతులు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలిచ్చారన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 218వ రోజు మంగళవారంనాడు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

విద్యార్థుల గురించి మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కన్న తండ్రిలా ఆలోచించారని శ్రీమతి షర్మిల తెలిపారు. డబ్బు లేక ఏ విద్యార్థి చదువూ ఆగిపోకూడదని ఫీజు రీయింబర్సుమెంటు చేశారని చెప్పారు. ఫీజు రీయింబర్సుమెంటు ద్వారా ఉన్నత చదువులు చదువుకోవాలని భరోసా కల్పించారు కనుకే లక్షలాది మంది ఉన్నత చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడి చక్కని జీవితాన్ని అనుభవిస్తున్నారన్నారు. నిరుపేదలకు కూడా కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సలు కూడా చేయించుకుని ఆరోగ్యవంతులయ్యారన్నారు. పక్కా ఇళ్ళు, పింఛన్లు అత్యధిక సంఖ్యలో అందజేశారన్నారు. ఇన్ని పథకాలు సక్రమంగా అమలు చేసినా ఒక్క చార్జీ గాని, ధర గాని, పన్నులు గాని వైయస్ఆర్‌ పెంచలేదని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఏ చార్జీ పెంచకుండానే, పన్నులేవీ పెంచకుండానే పథకాలను నిర్విఘ్నంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైయస్ఆర్‌ అన్నారు.

గిరిజనుల అభివృద్ధికి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారని శ్రీమతి షర్మిల తెలిపారు. గిరిజనులంటే రాజశేఖరరెడ్డికి చాలా ప్రేమ అన్నారు. అందుకే వారికి 20.60 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన ఘనత ఆయనది అన్నారు. దీంట్లో 3.30 లక్షల ఎకరాలను ఒకే రోజు పంపిణీ చేసి చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తి రాజశేఖరరెడ్డి అని చెప్పారు. అంతే కాకుండా 9 లక్షల ఎకరాల అటవీ భూమిపై గిరిజనులకు హక్కులు కల్పించారన్నారు. భూములిచ్చి చేతులు దులుపుకోకుండా వాటిని సాగుయోగ్యం చేసుకోవడానికి వాటిని ఉపాధి హామీ పథకం కిందకు తీసుకువచ్చారని చెప్పారు. ఆ భూమిలో పనిచేసిన వారికి రోజుకు వంద రూపాయల చొప్పున వైయస్ఆర్‌ ఉపాధి కూలిగా అందజేయడమే కాకుండా పని దినాలను వంద నుంచి 150 రోజులకు పెంచారన్నారు.

తోటపల్లి రిజర్వాయర్‌ నిర్మించి శ్రీకాకుళం జిల్లాలోని 65 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని రాజశేఖరరెడ్డి తలపెట్టారని శ్రీమతి షర్మిల తెలిపారు. తోటపల్లి పూర్తయితే కేవలం పాలకొండ నియోజకవర్గంలోనే 40 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందన్నారు. వైయస్‌ హయాంలో ఈ పథకం పనులు ప్రారంభించా సుమారు 80 శాతం పూర్తి చేశారని అన్నారు. మిగిలిన 20 శాతం పనులను ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని దుయ్యబట్టారు. వైయస్‌ బ్రతికే ఉంటే దీనిని ఎప్పుడో పూర్తిచేసి ఉండేవారన్నారు. తోటపల్లి ఒక్కటే కాకుండా రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టును తీసుకున్నా ఇదే పరిస్థితి అని నిప్పులు చెరిగారు. వైయస్ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళలో 12 ప్రాజెక్టులు పూర్తిచేసి 21 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తుచేశారు. మరో 21 ప్రాజెక్టులను ఆయన పాక్షికంగా పూర్తిచేశారన్నారు. ‌కిరణ్‌ ప్రభుత్వానికి వ్యవసాయం అంటేనే చిన్నచూపు అని విమర్శించారు.

వ్యవసాయానికి లాభం లేదు.. మహిళలకు ఆసరా లేదు.. విద్యార్థులకు చదువు లేదు.. పరిశ్రమలకు కరెంటు లేదు.. కార్మికులకు పనిలేదు.. రాష్ట్రానికి అభివృద్ధి లేదు.. రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతే లేదు.. ఇదీ మన పరిస్థితి ఈ రోజు అని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌ బ్రతికి ఉంటే వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ తప్పకుండా ఇచ్చి ఉండేవారన్నారు. కరెంటు సక్రమంగా ఇవ్వని ఈ ప్రభుత్వం తీరు వల్ల రైతులు రాత్రీ పగలూ పొలంలోనే వేచి ఉండాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. లేని కరెంటుకు మూడింతలు బిల్లులు వేసి రూ. 32 వేల కోట్ల ఆర్థిక భారం వేసి ఈ ప్రభుత్వం ప్రజల రక్తం పిండి మరీ వసూలు చేస్తోందని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచిందని, ఎరువుల ధరలు 800 శాతం పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. పన్నులన్నీ పెంచేసిందన్నారు.

ఈ దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా చార్జీల మోత, కరెంటు కోతలను నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటై అవిశ్వాస తీర్మానం పెడితే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా విప్‌ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల పక్షాన నిలబడకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఈగ కూడా వాలనివ్వకుండా రక్షిస్తున్నారని దుయ్యబట్టారు. స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చివాళ్ళను చేసి ఒక్క మంత్రి పదవి కోసం చిరంజీవి కాంగ్రెస్‌కు అమ్మేసుకున్నారని.. ఓటేసిన కోట్లాది మందిని వంచించి, తన మీద వచ్చిన కేసులపై విచారణ జరగకుండా చంద్రబాబు నాయుడు కూడా టిడిపిని అమ్మేశారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలారన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు వ్యవసాయం దండగ అని, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని, ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు.. సబ్సిడీలు ఇస్తే సోమరిపోతులవుతారని అన్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. మెస్‌ చార్జీలు అడిగిన విద్యార్థులను పోలీసు లాఠీలతో కొట్టించిన చంద్రబాబు నిరుపేదలు వెళ్ళే ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్‌ చార్జీలు వసూలు చేసిన దుర్మార్గుడన్నారు.

ఈ చంద్రబాబు‌- కాంగ్రెస్ కుమ్మక్కైనట్లు శ్రీమతి షర్మిల విమర్శించారు. అబద్ధపు కేసులు పెట్టి, సిబిఐని ఉసిగొల్పి జగనన్నను జైలులో పెట్టించారని ఆరోపించారు. జగనన్న బయటే ఉంటే కాంగ్రెస్, టిడిపిలకు మనుగడ ఉండదని వారికి తెలుసని అందుకే జగనన్నపై కుట్రలు చేశారన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుడ్ని, జగనన్ననూ ఆపడం కాంగ్రెస్, టిడిపిల తరం కాదన్నారు. త్వరలోనే జగనన్న వస్తారని, మనందర్నీ రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారన్నారు. ఆ రోజు వచ్చేంత వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వాలని, తమతో కలిసి కదం తొక్కాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న సిఎం అయ్యాక అమలు చేసే పథకాల గురించి శ్రీమతి షర్మిల వివరంగా చెప్పారు. రైతులు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలిస్తారన్నారు. రూ. 3 వేల కోట్లతో పంటలకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారన్నారు. రాజన్న ప్రతి కలనూ జగనన్న నెరవేరుస్తారని హామీ ఇచ్చారు.

Back to Top