బొత్స అంటే విజయనగరం ప్రజలకే అసహ్యం

పార్వతీపురం (విజయనగరం జిల్లా),

20 జూలై 2013: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై వైయస్ఆర్ తనయ‌ శ్రీమతి షర్మిల తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె శనివారం ఉదయం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మద్యం వ్యాపారాన్నే కాకుండా జిల్లాలోని అన్ని అక్రమ, సక్రమ వ్యాపారాలన్నింటినీ బొత్స సత్యనారాయణ తన ఆధీనంలో ఉంచుకున్నారన్నారని షర్మిల ఆరోపించారు. సొంత జిల్లా విజయనగరంలోనే బొత్సను ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. మహానేత మరణంతో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా నష్టపోయామని, అయితే వైయస్ మరణంతో బొత్స మాత్రం అత్యంత ల‌బ్ధి పొందారని జిల్లా ప్రజలు చెబుతున్నారని ఆమె ప్రస్తావించారు.

సీతానగరంలో నిత్యం రద్దీగా ఉండే రైల్వే లైనుపై ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరినప్పుడు మహానేత వైయస్ఆర్‌ వెంటనే దాన్ని మంజూరు చేశారని శ్రీమతి షర్మిల చెప్పారు. వైయస్‌ ఉండగా చక్కని డిజైన్‌తో ఏర్పాటవుతున్న ఈ వంతెనను ఆయన మరణించిన తరువాత మంత్రి బొత్స సత్యనారాయణ తన రైస్‌ మిల్లు కోసమని డిజైన్‌ మార్పించి వంకరటింకర్లుగా తిప్పి, పొడవును పెంపు చేయించారన్నారు. దీని కోసం ముందున్న నిర్మాణ వ్యయం కంటే ఎన్నో రెట్లు ఖర్చు పెరిగిపోయిందని స్థానికులు చెప్పారన్నారు. చివరికి ఖర్చు తడిసి మోపెడవడంతో కాంట్రాక్టరు సగంలోనే వంతెన నిర్మాణాన్ని ఆపేసి వెళ్ళిపోవాల్సి వచ్చిందని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం ఇంతగా చేయవచ్చా! అని శ్రీమతి షర్మిల విస్మయం వ్యక్తం చేశారు.

తోటపల్లి ప్రాజెక్టు నుంచి అదనంగా మరో లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా దాని ఆధునికీకరణకు వైయస్ రా‌జశేఖరరెడ్డి రూ. 450 కోట్లు మంజూరు చేశారని శ్రీమతి షర్మిల వివరించారు. ఆ ప్రాజెక్టు పనులు 50 శాతం ఆయన హయాంలోనే పూర్తిచేశారని చెప్పారు. కానీ జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణకు గజపతినగరం దగ్గర ఉన్న పొలానికి కూడా నీళ్ళు రావాలని, దాని పొడుగు పెంచాలని డిమాండ్లు పెట్టి ఆ ప్రాజెక్టును ఎక్కడికక్కడే ఆపేశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టును స్వార్థ ప్రయోజనం కోసం ఆపేసిన బొత్సను ఏమనాలని ఆమె ప్రశ్నించారు.

వైయస్‌ఆర్‌ ప్రారంభించిన జంఝావతి ఆధునికీకరణ పనులు కూడా ఇప్పుడు నత్త నడకన సాగుతున్నాయని విచారం వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,500 గ్రామాలకు తాగునీరు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు వైయస్ఆర్‌ శంకుస్థాపన చేశారన్నారు. కేవలం విజయనగరం జిల్లాకు మాత్రమే 3.90 లక్షల ఎకరాలకు అది నీరందించాల్సి ఉందన్నారు. అయితే, ఈ ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేస్తుంటే విజయనగరం జిల్లాకే చెందిన మంత్రి బొత్స కనీసం ఒక్క మాటైనా మాట్లాడారా? అని శ్రీమతి షర్మిల నిలదీశారు. ఓట్లు వేసి అధికారాన్ని అప్పచెప్పిన ప్రజల పక్షాన బొత్స ఒక్కసారైనా గొంతు విప్పారా? అని ఆమె ప్రశ్నించారు. ఈయన ఒక నాయకుడా? అని ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు ఓట్లు వేసి గెలిపించకపోతే బొత్స ఒక మంత్రీ కాదు... ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయ్యేవారు కాదన్నారు. తనను గెలిపించి ప్రజల రుణం తీర్చుకోవాలన్న తీరు బొత్సలో ఏ కోశానా కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయనగరం జిల్లాకు రాకు ముందు బొత్స ఒక మద్యం మాఫియా డాన్‌ అని మాత్రమే తాను విన్నానని శ్రీమతి షర్మిల తెలిపారు. మద్యం మాఫియా నుంచి అన్ని మాఫియాలతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయని జిల్లా ప్రజలు తనకు చెప్పారన్నారు. మద్యం వ్యాపారమైనా, కేబుల్‌ వ్యాపారమైనా, కాంట్రాక్టయినా సరే, గ్రానైట్‌ పరిశ్రమ అయినా అన్నీ బొత్స సత్యనారాయణవే అని జిల్లా ప్రజలు చెబుతున్నారని అన్నారు. అన్ని వ్యాపారాలు వారివే, అన్ని లాభాలు వారివే అన్నారని చెప్పారు. ఎవ్వరినీ పైకి రానివ్వరని, ఆయన అరాచకాలు ఎప్పుడు ఆగిపోతాయో ఈ జిల్లాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో అని వాపోతున్నారని చెప్పారు.

వైయస్‌ వెళ్ళిపోయాక విజయనగరం జిల్లా ప్రజలంతా ఏదో ఒక విధంగా నష్టపోయారని, కానీ బొత్స కుటుంబం మాత్రం పైకి వచ్చిందని జిల్లా ప్రజలు చెప్పారన్నారు. ప్రభుత్వం ప్రజల బాగోగులు చూడడానికి ఉందా లేక ఇలా అధికారం అనుభవిస్తున్న ఇలాంటి నాయకుల కోసం ఉందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా తాను ఎన్నో జిల్లాలు తిరిగానని, కానీ బొత్సకు ఉన్నంత చెడ్డ పేరు మరే నాయకుడికీ లేదన్నారు. మన రాష్ట్రంలోనే బొత్స ఒక పెద్ద మద్యం మాఫియా డాన్‌ అని, ఆయనకు మించిన వారు మరొకరు లేరని అందరికీ తెలిసిందే అన్నారు.

గాంధీజీ తమకు ఆదర్శం అని చెప్పుకుంటూనే ఒక మద్యం మాఫియా డాన్‌ను తీసుకువచ్చి పిసిసి అధ్యక్షుడిగా చేశారంటే కాంగ్రెస్ ‌పార్టీని గాంధేయ వాదమా? లేక బ్రాందేయ వాదమా? శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ఒక మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉండి బినామీ పేర్లతో మద్యం వ్యాపారం చేయడం తప్పు కాదా అని తాము ప్రశ్నించామన్నారు. ఆ బినామీ వ్యాపారాలపై విచారణ చేస్తున్న అధికారులను బదిలీ చేయించడం తప్పుకాదా? అని ప్రశ్నించాన్నారు. ఈ ప్రశ్నలు విన్న బొత్స చాలా భయపడిపోయారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. తాము సంధిస్తున్న ప్రశ్నలను ఢిల్లీలోని కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టికి వెళితే ఇక తన పదవులు ఊడిపోవడం ఖాయమని బొత్స అనుకున్నారో ఏమో ఆయన చాల అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాజశేఖరరెడ్డి కొంచెం తాగారని, అమెరికా ప్రెసిడెంటు ఒబామా ఇంకొంచెం తాగారని ఇలా సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మద్యం వ్యాపారంలో మునిగి తేలుతున్న బొత్స ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతారని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.

బొత్సను వ్యక్తిగతంగా తాము ఎప్పుడూ విమర్శించలేదని శ్రీమతి షర్మిల చెప్పారు. ఆయన అలవాట్లు గురించి కానీ, ఆయన కుటుంబం గురించి కానీ తామెప్పుడూ మాట్లాడలేదన్నారు. అది తమ సంస్కారం అన్నారు. కానీ మరణించిన రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడే స్థాయికి బొత్స దిగజారిపోయారని ఆమె నిప్పులు చెరిగారు. కొత్త నాయకత్వానికి వంత పాడి, వారి ప్రాపకం సంపాదించుకోవడానికి పాత నాయకులను విమర్శించడం బొత్స, ఉండవల్లి, ఆనం బ్రదర్సు లాంటి భజన బృందానికి మామూలే అని విమర్శించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వారసులమని చెప్పుకోవడానికి తమకు గర్వంగా ఉందని శ్రీమతి షర్మిల చెప్పారు. రాజశేఖరరెడ్డికి ఉన్న విశ్వసనీయత అలాంటిది అన్నారు. రాజశేఖరరెడ్డి గారి మరణ వార్త విని 660 మంది ఆయనతో పాటే వెళ్ళిపోతే ఆయన పట్ల ఉన్న విశ్వాసం ఎంతటిదో ప్రపంచం అంతా చూసిందని సగర్వంగా చెప్పారు. సొంత జిల్లా ప్రజలే బొత్సను ఛీ కొడుతుంటే ఆయన విశ్వసనీయత ఏమిటో ఆ రోజే అర్థమైపోయిందన్నారు. మన రాష్ట్రాన్ని‌ హరితాంధ్రప్రదేశ్‌ చేయాలని వైయస్ భావిస్తే... బొత్స, కాంగ్రెస్‌ నాయకులు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారనడం వాస్తవం కాదా అన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాగునీరిచ్చేందుకు 86 ప్రాజెక్టులను నిర్మించాలని తలపెట్టారని శ్రీమతి షర్మిల చెప్పారు. సాగునీరిచ్చారు, వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్‌, మద్దతు ధర ఇచ్చారన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, నష్టపరిహారం కూడా అందజేశారన్నారు. రైతులకు పెట్టుబడులు తగ్గేలా చూస్తూనే మరో పక్క వారికి ఆదాయం ఎక్కవ వచ్చేలా చూశారని ఆమె చెప్పారు. వైయస్ఆర్‌ సిఎం అయిన వెంటనే రూ. 1,200 కోట్ల విద్యుత్‌ బకాయిలు మాఫీచేసిన వైనాన్ని పేర్కొన్నారు. తరువాత రుణాల మీద ఉన్న రూ. 1,300 కోట్ల వడ్డీని కూడా మాఫీ చేశారన్నారు. అనంతరం రూ. 12,000 కోట్ల రుణాలను ఆయన మాఫీ చేయించారన్నారు.

సీతానగరంలో మహానేత వైయస్ఆర్‌ ఏర్పాటు చేసిన ఎస్టీ గురుకులం స్కూలు, కస్తూర్బా హైస్కూలు, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూలుకు 2005లో పల్లెబాటకు వచ్చనప్పుడు అనుమతులిచ్చారని శ్రీమతి షర్మిల తెలిపారు. ఆ క్రమంలో అక్కడ ఏర్పాటైన భవనాల మీద నుంచి విద్యార్థులు కేరంతలు కొడుతుంటే ఆనందంతో ఉప్పొంగిపోయానని శ్రీమతి షర్మిల చెప్పారు. రాజశేఖరరెడ్డి పుణ్యమా అని 1,200 మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారని స్థానికులు చెప్పినప్పుడు మనసు ఎంతో తృప్తిగా అనిపించిందన్నారు.

రాష్ట్ర ప్రజలపై కిరణ్‌ ప్రభుత్వం ధరల భారం మోపి చోద్యం చూస్తోందని శ్రీమతి షర్మిల ఆగ్రహం చేశారు. వైయస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆమె ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం చేతకాకపోయి‌నా, ఇప్పుడు ఆయన మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని విమర్శించారు. ప్రజాకంటకంగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఈగ కూడా వాలడానికి వీల్లేదని విప్‌ జారీ చేసి మరి చంద్రబాబు కాపాడారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ కరెంటు కోతలు, చార్జీల మోతలు మనకు ఉండేవే కాదన్నారు. చంద్రబాబకు ప్రజల బాగోగులు ఎప్పుడూ పట్టలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని నిప్పులు చెరిగారు.

విద్యార్థుల గురించి వైయస్ఆర్‌ కన్న తండ్రి స్థానంలో ఉండి ఆలోచన చేశారన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు ద్వారా లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు ఉచితంగానే చదువుకుని, మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. అనారోగ్యం చేస్తే పేదలు కూడా ధనవంతుల మాదిరిగా కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా పొందేందుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారని శ్రీమతి షర్మిల చెప్పారు. ఒక్క మన రాష్ట్రంలోనే వైయస్ఆర్‌ 47 లక్షల పక్కా ఇళ్ళు కట్టించి ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ, కరెంట్, గ్యా‌స్ ధరలు పెంచలేదని‌ శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.‌ ఏ ధరలూ పెంచకుండానే అభివృద్ధి, సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసిన అరుదైన ముఖ్యమంత్రిగా వైయస్‌ఆర్ చరిత్రకెక్కారని ఆమె పేర్కొన్నారు. మహానేత హయాంలో రాష్టంలో జరిగిన సంక్షేమాన్ని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా వివరించారు.

విలువలతో కూడా రాజకీయాలు చేసే దమ్మూ ధైర్యం ఈ కాంగ్రెస్, టిడిపి నాయకులకు లేదని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. అందుకే ఆ రెండు పార్టీలూ కుమ్మక్కై శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించాయని శ్రీమతి షర్మిల ఆరోపించారు. త్వరలో జగనన్న బయటకు వస్తారని, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వైయస్‌ఆర్ సువర్ణ పాలన రాష్ట్రంలో వస్తుందని ఆమె హామీ ఇచ్చారు. బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుడిని‌, జగనన్ననూ ఆపడం ఎవరి తరమూ కాదని శ్రీమతి షర్మిల ధీమాగా చెప్పారు. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వచ్చాక అమలు చేసే పథకాల గురించి ఆమె సవివరంగా తెలిపారు. రాబోయే సువర్ణ యుగానికి నాంది పలకాలంటే.. ప్రజలందరూ జగనన్నను, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించి, తమతో పాటు కదం తొక్కాలని పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top