దివ్యాంగుల కష్టాలు తీర్చాలి

ఒంగోలు ‌: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన కేంద్రంలో దివ్యాంగుల కోసం సదరమ్‌ క్యాంపు నిర్వహించాలని కలెక్టర్, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడినట్లు పార్లమెంట్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి  ఓ ప్రకటనలో తెలిపారు. సదరమ్‌ సర్టిఫికెట్ల కోసం గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం వంటి సుదూర ప్రాంతాల నుంచి దివ్యాంగులు ఒంగోలు రిమ్స్‌లోని సదరమ్‌ క్యాంపునకు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. వైకల్యం ఎక్కువగా ఉన్న కొంతమంది దివ్యాంగులు అసలు రాలేని పరిస్థితి ఉందని తెలిపానన్నారు.

దివ్యాంగుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నియోజకవర్గంలో సదరమ్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి రిమ్స్‌ వైద్యులచే పరీక్షలు నిర్వహించి అక్కడే సర్టిఫికెట్లు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని అధికారులను కోరినట్లు చెప్పారు.  ఇటీవల కంభం, కనిగిరిలో దివ్యాంగుల స్క్రీనింగ్‌ క్యాంపు నిర్వహించామని దానికి 750 మంది హాజరైతే వారిలో కేవలం 232 మందికి మాత్రమే సదరమ్‌ సర్టిఫికెట్లు ఉన్నాయని, మిగిలిన వారు క్యాంపు నుంచి వెనుదిరాగాల్సి వచ్చిందని వివరించినట్లు తెలిపారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు.

Back to Top