సదావర్తి స్కాంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి

  • సత్యనారాయణ బిల్డర్స్‌తో చంద్రబాబు తప్పుడు ప్రచారం
  • శ్రీనివాస్‌రెడ్డి ప్రకటనలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే ఆర్కే
  • వైయస్‌ఆర్‌ సీపీ వల్లే ప్రభుత్వానికి రూ.40 కోట్ల ఆదాయం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సదావర్తి భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. వేలంపాటలో సదావర్తి భూములను దక్కించుకున్న సత్యనారాయణ బిల్డర్స్‌ను వైయస్‌ఆర్‌ సీపీ బెదిరిస్తుందని చంద్రబాబు వారితో తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని, దీన్ని మేం పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం దొడ్డిదారిన రూ.22 కోట్లకు సదావర్తి భూములను లాక్కుంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ న్యాయపోరాటం చేయడం మూలంగా ప్రభుత్వానికి రూ.40 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దాన్ని ప్రతిపక్షం అభినందించి స్వాగతిస్తే....ఎట్టి పరిస్థితుల్లోనూ సదావర్తి భూములు తానే కొట్టేయాలనే ఉద్దేశ్యంతో శ్రీనివాస్‌రెడ్డితో బాబు తప్పుడు ప్రకటనలు ఇప్పించారన్నారు. అన్ని తెలుసుకొని పాటలోకి వచ్చామని పత్రికా ముఖంగా శ్రీనివాస్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. 

చెన్నైలోని సదావర్తి భూములను రాజావాసిరెడ్డి వారసులు 1885కు ముందే పేద బాహ్మణ విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు రాసిచ్చారని ఆర్కే చెప్పారు. బ్రాహ్మణులకు సంబంధించిన భూములు.. అయినా కూడా ప్రభుత్వం వీటిని వేలం వేసిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే భూములు అమ్మాలని సీఎంకు లేఖ రాశారన్నారు. దేవాదయ భుములు అమ్మాలంటే క్యాబినెట్ ఆమోదం ఉండాలన్నారు. కానీ,   జీవో ఇచ్చి కేబినెట్‌లో పెడితే ప్రపంచానికి తెలిసిపోతుందనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే లేఖ ఆధారంగా వేలం వేసి బాబు సదావర్తి భూములను తన బినామీలకు కట్టబెట్టారన్నారు. రిజిస్ట్రేషన్‌ వ్యాల్యూ ప్రకారం ఎకరా రూ.6 కోట్లు పలుకుతుందని అధికారులు చెబితే వారిని చంద్రబాబు బదిలీపై పంపించారన్నారు. మూడో కంటికి తెలియకుండా రూ.22 కోట్లకే సుమారు 64 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేయడానికి ప్లాన్‌ చేశారన్నారు. 

బ్రాహ్మణులపై అపారమైన ప్రేమ ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చివరకు పేద బ్రాహ్మణులకు దక్కాల్సిన ఆస్తిని కాజేయడానికి ప్రయత్నం చేశాడని ఆర్కే మండిపడ్డారు. బ్రాహ్మణుల ఆస్తి వారికే దక్కాలని వైయస్‌ఆర్‌ సీపీ కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. చివరకు హైకోర్టు అక్రమంగా వేసిన వేలాన్ని తప్పుబట్టిందన్నారు. నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి అయితే వెంటనే రివ్యూ పెట్టి ఎక్కడ లోపం జరిగిందో పరిశీలన చేసుకోవాలన్నారు. కానీ భూములు కొట్టేయాలనే ఉద్దేశ్యంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడన్నారు. చంద్రబాబులా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ తప్పుడు పని చేయదని ఆర్కే అన్నారు. గౌరవ హైకోర్టు తీర్పును పాటించకుండా బాబు తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించాడన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వేలంపాట పెడితే.. సుమారు 15 మంది పాల్గొన్నారన్నారు. పాట అయిన తరువాత రూ.22 కోట్లకు అమ్మిన భూమి రూ.60.30 కోట్లు పలికిందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం వల్లే సుమారు రూ.40 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు. దీన్ని చంద్రబాబు గ్రహించాలన్నారు. సత్యనారాయణ బిల్డర్స్‌ను అడ్డంపెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్న బాబు చిత్తశుద్ధి ఉంటే వెంటనే సదావర్తి భూములపై సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు. 
Back to Top