'షర్మిల పాదయాత్రను సక్సెస్‌ చేయండి'

కొవ్వూరు (ప.గో.జిల్లా) :

మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ‌ శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పిలుపునిచ్చారు. కొవ్వూరులోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులతో మండలాల వారీగా పాదయాత్ర ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలాల నాయకులతో పాటు కొవ్వూరు మున్సిపాలిటీ నాయకులతో ఆయన విడివిడిగా చర్చించారు. పాదయాత్రను విజయవంతం చేసేందుకు ముఖ్య నాయకులంతా గ్రామాలవారీగా బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల రెండవ తేదీ ఆదివారం రాత్రి కొవ్వూరు నియోజకవర్గంలోకి శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రవేశిస్తుందని, ఆయా గ్రామాల్లోని పార్టీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామానికి ఇద్దరు ముఖ్య నాయకులు బాధ్యతలు తీసుకుని, పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులను భాగస్వాములు చేయాలని ఆళ్ళ నాని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చే నాయకులు, కార్యకర్తలే కాకుండా స్థానికంగా మూడు, నాలుగు తేదీల్లో నియోజకవర్గంలో సాగే పాదయాత్ర కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిం చారు. మూడవ తేదీ ఉదయం చాగల్లులో‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆ‌ర్ విగ్రహావిష్కరణ అనంతరం‌ శ్రీమతి షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారన్నారు. అదే రోజు రాత్రి కొవ్వూరు మండలం దొమ్మేరులో రచ్చబండ నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు.

నాలుగవ తేదీ ఉదయం కొవ్వూరు-దొమ్మేరు మధ్య బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆళ్ళ నాని చెప్పారు. అదే రోజు సాయంత్రం జిల్లాలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగుస్తుందని చెప్పారు. కొవ్వూరు-రాజమండ్రి రోడ్ కం రైలు వంతెనను జనసంద్రంగా మార్చేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని కోరారు.

Back to Top