షర్మిల పాదయాత్రలో జనసంద్రమైన వేల్పుల

వేల్పుల (వైయస్‌ఆర్‌ జిల్లా), 20 అక్టోబర్‌ 2012: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌తనయ షర్మిల పాదయాత్ర సందర్భంగా వేల్పుల జనసంద్రంగా మారింది. మరో ప్రజాప్రస్థానం మూడవ రోజు యాత్రలో వేల్పుల వచ్చిన ఆమెకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. షర్మిల పాదయాత్ర సాగిస్తున్న దారి పొడవునా పూలవర్షం కురిపించారు. దారికి ఇరువైపులా నిలబడిన మహిళలు షర్మిలకు మంగళ హారతులు పట్టారు. అశేష జనవాహిని ఆత్మీయ స్వాగతం మధ్య షర్మిల వేల్పుల మీదుగా తన పాదయాత్ర ప్రస్థానాన్ని ముందుకు సాగించారు. షర్మిల వెంట ఆమె మాతృమూర్తి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ,‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.

పత్తిపంట పరిశీలన:
షర్మిల మరో ప్రజాస్థానం పాదయాత్ర మూడవ రోజు వైయస్‌ఆర్ జిల్లా భూమయ్యగారిపల్లె క్రా‌స్ నుంచి ప్రారం‌భమైంది. అసంఖ్యాకంగా తరలివచ్చిన అభిమానులు షర్మిలకు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర చేస్తున్న షర్మిల భూమయ్యగారిపల్లె క్రాస్‌ వద్ద పత్తిపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి రైతుల తమ కష్టాలను చెప్పుకున్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్‌ ఇదీ:
మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల నేటి మూడవ రోజు పాదయాత్ర జిల్లాలోని భూమయ్యగారిపల్లె క్రాస్ నుంచి ప్రారంభమై వేల్పుల చే‌రింది. అక్కడి నుంచి బెస్తవారిపల్లె, అనంతరం పులివెందుల ఆర్టీసి బస్టాండ్ సెంటర్‌కు చేరుతుంది. బస్టాండ్‌ సెంటర్ నుంచి పూల అంగళ్ల సర్కి‌ల్ ‌వరకూ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత రిషీ స్కూల్‌లో షర్మిల రాత్రికి బస చేస్తారు.
Back to Top