షర్మిలను కలుసుకున్న కుటుంబ సభ్యులు

వాడపల్లి (నల్గొండజిల్లా) : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలను ఆమె కుమారుడు, కుమార్తె, తల్లి శ్రీమతి విజయమ్మ బుధవారం కలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో శ్రీమతి షర్మిల బుధవారం వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన గుడారంలోనే గడిపారు. శ్రీమతి షర్మిల బస చేసిన ప్రాంతానికి ఆమె కుమారుడు, కుమార్తె మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు, షర్మిల తల్లి శ్రీమతి విజయమ్మ ఆమెను కలుసుకున్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాలో చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు శ్రీమతి షర్మిల రెండు రోజుల పాటు విరామం ప్రకటించారు. నల్గొండ జిల్లా సరిహద్దులోని వాడపల్లి సమీపంలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ శ్రీమతి షర్మిల బుధవారం ఒక్కసారి కూడా గుడారం నుంచి బయటకు రాలేదు. ఎవరికీ కనిపించలేదు. ఎవర్నీ కలవ లేదు.

కాగా, తమ గ్రామ సమీపంలోనే రాజన్న కూతురు బస చేసిందని తెలుసుకున్న సుమారు 300 మంది దామరచర్ల, వాడపల్లి సమీప గ్రామాల ప్రజలు ఆమెను పలకరిద్దామని ఆశతో వచ్చారు. అయితే, వారి కోరిక తీరకు శ్రీమతి షర్మిల సున్నితంగా తిరస్కరించడంతో నిరాశగా వెనుదిరిగారు. శ్రీమతి షర్మిలను చూసేందుకు సమీప పరిశ్రమల్లోని మహిళా కార్మికులు వచ్చినా ఎన్నికల కోడ్ కారణంగా ఆమె భద్రతా సిబ్బంది వారిని వెనుకకు‌ తిప్పి పంపారు.

శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 22న తిరిగి ప్రారంభమవుతుందని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ సమన్వయకర్త తలశిల రఘురాం, పార్టీ నల్లగొండ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి తెలిపారు.
Back to Top