201వ రోజుకు చేరుకున్న షర్మిల పాదయాత్ర

విశాఖపట్టణం 06 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 201వ రోజుకు చేరింది. విశాఖ జిల్లాలో పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. శనివారం ఉదయం బీచ్ రోడ్డులోని వైయస్ఆర్ సెంటర్ నుంచి యాత్రను ప్రారంభించారు. పాదయాత్రకు మద్దతు తెలుపుతూ మహానేత వైయస్ఆర్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర ఏఎస్‌ రాజా మైదానం, ఎంవీపీ డబుల్ రోడ్డు మీదుగా సాగి హనుమంతువాక సమీపంలో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత పెదగదిలి, తోట గరువు మీదుగా ఆరిలోవ చేరుకుంటారు. రాత్రికి అక్కడికి సమీపంలో శ్రీమతి షర్మిల బస చేస్తారు. కాగా మరోప్రజాప్రస్థానం పాదయాత్ర 11 జిల్లాలు దాటుకుని గత నెల 24వ తేదీ గన్నవరం మెట్ట వద్ద జిల్లాలోకి అడుగు పెట్టింది. పార్టీ శ్రేణులు, వైయస్ కుటుంబ అభిమానులు, ప్రజలు రాజన్న బిడ్డను ఘనంగా జిల్లాలోకి స్వాగతించారు. అక్కడి నుంచి ప్రారంభమైన బహుదూరపు బాటసారి యాత్ర సాగిన నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పెందుర్తి, గాజువాక నియోజక వర్గాల్లోని ప్రతి చోట జనం జేజేలు పలికారు.

Back to Top