సెర్పు ఉద్యోగులకు విజయమ్మ మద్దతు

హైదరాబాద్:

'గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్పు) ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గతంలో మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని కూడా ఈ‌ మనసు లేని కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కింది’ అని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సెర్సు ఉద్యోగుల డిమాండ్లను, వైయస్‌ఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్సు) ఉద్యోగుల కోరిక మేరకు ఇందిరాపార్కు వద్ద వారు చేపట్టిన నిరసన దీక్షను మంగళవారంనాడు శ్రీమతి విజయమ్మ సందర్శించారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు.

అనంతరం శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. ‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మనిషిని మనిషిగా ప్రేమించేవా‌రు. అందుకే ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా మంచి మనసుతో వెంటనే స్పందించి పరిష్కారం చూపేవారు. ఈ మనసులేని ప్రభుత్వం సమస్యలు సృష్టించడమే కానీ పరిష్కరించే ఆలోచన చేయద'ని ఆమె విమర్శించారు. ఈలోగా అసెంబ్లీలో అవకాశం వస్తే సెర్సు ఉద్యోగుల డిమాండ్లను తమ పార్టీ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిలదీస్తామని ఆమె చెప్పారు. దీక్ష చేస్తున్న ఉద్యోగులకు శ్రీమతి విజయమ్మ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.

Back to Top