ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసన

హైద రాబాద్ :  ఆర్టీసీ ఛార్జీల పెంపునకు వైెఎస్సార్సీపీ నిరసన తెలిపింది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

ఆర్టీసీ ఛార్జీల పెంపును వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. ఛార్జీల పెంపును దుర్మార్గమైన చర్యగా పార్టీ అభివర్ణించింది. ఒక వైపు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి సగం తగ్గినా, ప్రయాణికులపై ఛార్జీల భారం మోపటాన్ని పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో డీజిల్ పై 22.5 శాతం వ్యాట్ తో పాటు మరో నాలుగురూపాయిలు అదనంగా పన్ను విధించి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటడానికి చంద్రబాబు ప్రభుత్వం దోహద పడింది. అసలే నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని ఆదుకోవాల్సింది పోయి.. ప్రయాణికులపై అదనపు భారం మోపటాన్ని పార్టీ తీవ్రంగా నిరసిస్తోంది. సామాన్యులు, గ్రామీణులు ప్రయాణించే పల్లె వెలుగు బస్సులతో సహా ఎక్సుప్రెస్, డీలక్స్ బస్సుల ఛార్జీలను ఒక్కసారిగా టికెట్ పై 20 నుంచి 30 రూపాయిల వరకు పెంచటం అంటే ప్రయాణికుల నడ్డి విరగకొట్టడమే అని పార్టీ అభిప్రాయ పడింది.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తన పాత విధానాల్నే అనుసరిస్తూ ఆర్టీసీ ఉనికినే ప్రశ్నార్థకంగా తయారుచేస్తున్నారు.ఆయన తొమ్మిదేళ్ల పాలనలో అయిదు సార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారు. చంద్రబాబు తన పాలనలో ఆర్టీసీ పై ఎడాపెడా పన్నుల భారం మోపి పూర్తిగా దివాళా తీయించారు. మళ్లీ అదే చర్యలకు పాల్పడుతున్నారు. ప్రైవేటు రవాణా ను అరికట్టి డీజిల్ పై విధిస్తున్న వ్యాట్ ను ఎత్తివేస్తే ఛార్జీలు ఒక్క పైసా పెంచకుండానే ఆర్టీసీని నష్టాల బారి నుంచి గట్టెక్కవచ్చు. పెంచిన ఛార్జీలను తక్షణం ఉపసంహరించని పక్షంలో ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని పార్టీ హెచ్చరించింది.
Back to Top