రోజా సస్పెన్షన్ కొట్టివేసిన హై కోర్టు

ఇది ప్రజల విజయం
న్యాయస్థానాలకు నా కృతజ్ఞతలు
న్యాయస్థానాలపై నమ్మకం రెట్టింపు అయ్యింది
ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్నినిలదీస్తాంః రోజా

హైదరాబాద్ః  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈవిజయం నాది మాత్రమే కాదు నియోజకవర్గ ప్రజలదని రోజా చెప్పారు. తన ప్రజలకు న్యాయం చేయడం కోసం తన హక్కులను కాపాడుకునేందుకు కోర్టుకు వెళ్లడం జరిగిందని రోజా చెప్పారు. సభకు వెళ్లేందుకు అనుమతిచ్చినందుకు న్యాయస్థానానికి రోజా కృతజ్ఞతలు తెలిపారు. న్యాయస్థానాల మీద తనకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసుకున్నానని రోజా స్పష్టం చేశారు. ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని ఎప్పుడు నిలదీస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు.  తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రజల తరపున పోరాడుతూనే ఉన్నానని రోజా చెప్పారు. ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా న్యాయం కోసం పోరాడుతానన్నారు. సభకు వెళ్లి అన్నింటిపై వివరణ ఇస్తానని పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి సమాధానం..!
తనకు చాలా సంతోషంగా ఉందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి తగిన సమాధానం చెప్పినట్లయిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. అయితే కోర్టు ఇచ్చినవి మధ్యంతర ఉత్తర్వులు కాబట్టి ఈ విషయంలో ఇంతకంటే పెద్దగా చెప్పనని, ప్రజలకు రాజ్యాంగంపై విశ్వాసం ఉందని.. అది మరోసారి నిలబడిందని ఆమె అన్నారు. సరైన వేదికపై ఎమ్మెల్యేకున్న హక్కులను న్యాయస్థానం పునరుద్ధరించిందని, పౌరుల హక్కులను రాజ్యాంగమే కాపాడగలదని చెప్పారు. రోజా ఈరోజే అసెంబ్లీకి వెళ్లచ్చని, అసెంబ్లీ కార్యదర్శికి ఈమెయిల్ ద్వారా ఉత్తర్వులు వెళ్తున్నాయని ఆమె తెలిపారు.

అసెంబ్లీకి రోజా..

కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కూడా ఏర్పడింది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. రోజా తరఫున సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపంచారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, నిబంధనల ప్రకారం కేవలం ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెన్షన్ విధించే అధికారం స్పీకర్‌కు ఉందని, అదికాదని ఏడాదిపాటు విధించడానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం కూడా అధికారం లేదని రోజా అన్నారు.


ఈ అంశంపైనే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొలుత దాన్ని విచారించడానికి కూడా హైకోర్టులో ఆమోదం లభించలేదు. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది. దాంతో హైకోర్టులో బుధవారం ఈ అంశంపై వాడివేడి వాదనలు జరిగాయి. వాదనల అనంతరం తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.  నాడు హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై తన మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

Back to Top