రాజీనామాలు వ్యక్తిగతం: వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ 26 జూలై 2013:

రాజీనామాలు తమ వ్యక్తిగత నిర్ణయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పార్టీ నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఏ ప్రాంతానికీ నష్టం వాటిల్లకుండా  తెలంగాణ సమస్య పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయంతో చరిత్రహీనులుగా మిగిలిపోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేర్నినాని, వంగవీటి రాధాలతో కలిసి చంచల్‌గూడలో పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాజీనామా వ్యక్తిగతమని నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. తన రాజీనామాతో పార్టీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర విభజన అనే పరిష్కారాన్ని కోరుకోవడంలేదన్నారు. ఓట్లు, సీట్లుకోసం కాంగ్రెస్ విభజన రాజకీయం చేస్తుందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగానే తాను రాజీనామా చేశానని, రాజీనామా వ్యవహారం తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పారు. రాష్ట్రం ఉంటే సమైక్యంగా ఉండాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. ప్రజల అభీష్టం మేరకే తాను రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు.

Back to Top