రైతు సమస్యలపై వైయస్‌ఆర్‌సిపి ఆందోళన

ఆదిలాబాద్, 27 ఫిబ్రవరి 2013: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనలో పార్టీ నాయకులు బి. జనక్‌ప్రసాద్, ‌అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బోడ జనార్ధన్ పాల్గొన్నారు. అకాల వ‌ర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళన ‌నిర్వహించిన అనంతరం వారు నిర్మల్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

పంట నష్టపోయిన రైతులకు 15 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే 48 గంటల దీక్ష చేపడతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆ వినతిపత్రంలో హెచ్చరించారు.‌ రైల్వే మంత్రి పి.కె. బన్సల్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని‌ వైయస్‌ఆర్‌సిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన జిల్లా అయినందునే ఆదిలాబాద్‌పై కేంద్రం చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించారు.
Back to Top