రైతన్న కడుపు మీద కొడుతున్న ప్రభుత్వం

ఆస్పరి

(కర్నూలు జిల్లా) 11 నవంబర్ 2012 : ఈ ప్రభుత్వం అన్నం పెట్టే రైతన్న కడుపు మీద కొడుతోందని షర్మిల విమర్శించారు. గిట్టుబాటు ధరలు లేక, అప్పుల భారం పెరిగి, పంట నష్టమై నేడు రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'మరో ప్రజాప్రస్థానం' 25వ రోజు పాదయాత్రలో భాగంగా ఆమె కర్నూలుజిల్లా ఆస్పరి అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఒక భారీ బహిరంగసభలో ప్రసంగించారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆమె నిరసించారు. రైతులు తమకు బ్రతుకుభారమై పోయిందంటు న్నారనీ, అయితే ప్రాణాలు విలువైనవనీ ఆమె అన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుందనీ, ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుందనీ ఆమె భరోసా ఇచ్చారు. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా వస్తాయని ఆమె హామీ ఇచ్చారు. రాజన్న ప్రతి మాటనూ జగనన్న నెరవేరుస్తారనీ, కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నకల కూడా సాకారమౌతుందనీ షర్మిల అన్నారు.
హంద్రీ-నీవా నిర్మాణాన్ని నాలుగువేల కోట్ల రూపాయల వ్యయంతో మొదలుపెట్టి 95 శాతం రాజశేఖర్ రెడ్డిగారు పూర్తి చేశారనీ, కేవలం రూ. 45 కోట్లతో మిగిలిన 5 శాతం పనులు పూర్తి అవుతాయనీ, అయినప్పటికీ మూడేళ్లుగా ఈ ప్రభుత్వం దానిన పట్టించుకోలేదనీ ఆమె విమర్శించారు. టిడిపి హయాంలో ఈ ప్రాజెక్టుకు రెండు సార్లు శిలాఫలకాలు వేసి వదిలేసిన సంగతి ఆమె గుర్తు చేశారు. మూడేళ్లు పట్టించుకోని ప్రభుత్వం తన పాదయాత్ర తర్వాత ఇప్పుడు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి, గేట్లు ఎత్తడానికి రఘువీరారెడ్డి వస్తారంటున్నారనీ ఆమె ఎద్దేవా చేశారు. ఇది సొమ్మొకడిదీ సోకొకడిదీ అన్నట్లుగా ఉందనీ ఆమె ఎగతాళి చేశారు. హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువల కింద రిజర్వాయర్లకు తుంగభద్ర నుంచి నీటిని
విడుదల చేయించలేని హీనస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ
రిజర్వాయర్లు నిండితే భూగర్భ జలాలు పెరిగి బోర్లు పనిచేసేవని, వేలాది
ఎకరాలు సాగయ్యేదని, ఈ పాపం ప్రభుత్వానిదేననీ ఆమె అన్నారు.ఆస్పరిలో అధికంగా టొమాటో పండించే రైతులు గిట్టుబాటు ధర లేక పండించడం లేదన్నారు. టొమాటో పండించిన రైతులు కూడా ధర లేక రోడ్డుపైన
పడేస్తున్నారని అన్నారు. జగన్ సీఎం అయితే ఆస్పరిలో టమోటా ప్రాసెసింగ్
యూనిట్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే రైతుల నుంచి టొమాటో కొనుగోలు చేస్తుందని షర్మిల హామీ ఇచ్చారు.
ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ, ఉపాధి హామీ పథకం వంటి అనేక పథకాలను ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆమె విమర్శించారు. నిలదీయాల్సిన ప్రధానప్రతిపక్షం చోద్యం చూస్తోందన్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ప్రధాన వాగ్దానాలైన రెండు రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్యనిషేధం కార్యక్రమాలను విస్మరించారన్నారు. బాబుకు ఒక ఎలక్షన్లో చెప్పిన మాట ఇంకో ఎలక్షన్లో గుర్తుండదు, ఒక మీటింగ్‌లో చెప్పిన మాట ఇంకో మీటింగ్‌లో గుర్తుండదు అని షర్మిల ఎద్దేవా చేశారు. మాట నిలుపుకోవడమన్నది చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాని విషయమన్నారు. ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచిన బాబు తన హయాంలో రైతులకు బకాయిలు కట్టమంటూ ఒత్తిడి చేశారనీ, జైళ్లకు సైతం పంపారనీ ఆమె గుర్తు చేశారు. "ఆ అవమానాలు తట్టుకోలేక నాలుగు వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పాపం చంద్రబాబుది కాదా?" అని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్తడ్రామా మొదలుపెట్టారని ఆమె విమర్శించారు. "ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేసే శక్తి బాబుకు ఉంది. ఈ ప్రభుత్వాన్ని దించేస్తే ఎంతోమంది జీవితాలు నిలబడతాయి. కానీ చంద్రబాబు అవిశ్వాసం పెట్టరట. ఈ ప్రభుత్వాన్ని దించరట" అని షర్మిల వ్యంగ్యంగా అన్నారు. లక్షల కోట్లు విలువైన కేజీ బేసిన్ గ్యాస్‌ను చంద్రబాబు రిలయన్స్‌కు కట్టబెట్టి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారన్నారు. ఆ గ్యాస్‌ మనకు దక్కి ఉంటే పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికీ వంటగ్యాస్ లభించేదన్నారు.

అలాగే ఐఎంజీకి కోట్లాది రూపాయల విలువైన భూములను అప్పనంగా అప్పగించారన్నారు. ఈ కుంభకోణాలపై విచారణ ఎందుకు జరగదని ఆమె నిలదీశారు. కానీ జగనన్నపై అబద్ధపు కేసులు బనాయించి సిబిఐని వాడుకుని, బెయిలు కూడా రాకుండా జైలు పాలు చేశారన్నారు. అయితే జగనన్న బయటకు వస్తాడనీ, రాజన్న రాజ్యం స్థాపించే దిశగా అందరినీ నడిపిస్తాడనీ షర్మిల ధీమా వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. ఈ  సభలో వైయస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ గౌరువెంకటరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
25వ రోజు షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన
లభించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పత్తికొండ నియోజకవర్గంలో సాగిన
పాదయాత్ర మధ్యాహ్న భోజనానంతరం ఆలూరు నియోజకవర్గంలోకి
అడుగుపెట్టింది. ఆలూరు నియోజకవర్గం ఇన్‌చార్జి గమ్మనూరి జయరాం నేతృత్వంలో
పెద్దయెత్తున జనం  షర్మిల పాదయాత్రను ఆలూరు నియోజకవర్గంలోకి స్వాగతించారు.


Back to Top