రాజన్న రాజ్యం తెస్తాం: విశ్వేశ్వర రెడ్డి

అనంతపురం:

‘మేం రాజన్న రాజ్యం తెస్తామని గర్వంగా చెప్పగలం. మీరు చంద్రబాబు రాజ్యాన్ని తిరిగి తెస్తామని చెప్పగలరా’ అంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఆ పార్టీ కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ  సభ్యుడు అయిన వై. విశ్వేశ్వరరెడ్డి టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆదివారం వజ్రకరూరు మండలం రాగులపాడు బహిరంగసభలో ఆయన మాట్లాడారు.  ‘కోటీశ్వరులు, కార్పొరేట్ సంస్థలపైనే చంద్రబాబు ప్రేమ కురిపించారు. బడుగు, బలహీన వర్గాలు, రైతులు, చేనేతల పట్ల రాక్షసంగా వ్యవహరించారు. ఆయన తీరు వల్లే నాలుగు వేల మంది రైతులు, వందలాది మంది చేనేతలు ఆత్మహత్య చేసుకున్నారు. చంద్రబాబు ఏనాడూ ఏ ఒక్కరికీ ఎకరా భూమిని కూడా పంపిణీ చేసిన దాఖలాలు లేవు. అన్ని వర్గాలనూ పీడించారు. అదే మహానేత వైయస్ హయాంలో లక్షలాది ఎకరాలను నిరుపేదలకు పంపిణీ చేశారు. జిల్లా రైతులకు చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.250 కోట్ల రుణాలిస్తే.. వైయస్ హయాంలో రూ.1,800 కోట్లు ఇప్పించారు. 2008-09లో వేరుశనగ పంట నష్టపోయినప్పుడు రూ.600 కోట్ల నష్టపరిహారం ఇప్పించిన ఘనత వైయస్‌దే’నని స్పష్టం చేశారు. పంట రుణాలు మాఫీ చేసిందీ, వందలాది కోట్ల విద్యుత్తు  బకాయిలను రద్దు చేసిందీ మహానేతేనని గుర్తు చేశారు.  జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న రాజ్యం మళ్లీ తెస్తామని సగర్వంగా చెబుతున్నామన్నారు. అదే చంద్రబాబు రాజ్యాన్ని తెస్తామని చెప్పే ధైర్యం టీడీపీ నాయకులకు లేదన్నారు.

Back to Top