పులి పులే - నక్క నక్కే!

హైదరాబాద్ 2 డిసెంబర్ 2012 : మహానేత రాజశేఖర్ రెడ్డిగారి పథకాలనే అమలు చేస్తామంటూ చంద్రబాబు చెబుతున్నారనీ, ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ఫీజుల రీ ఇంబర్స్‌మెంట్ పథకం నుండి ఆరోగ్య శ్రీ వరకు వైయస్ సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ అమలు చేస్తామంటున్నారని ఆమె అన్నారు. అయితే ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి పులే, నక్క నక్కేనని ఆమె వ్యాఖ్యానించారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా షర్మిల ఆదివారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగిన ఒక భారీ బహిరంగసభలో ప్రసంగించారు.
పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు ప్రజల సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నాయో బాగా తెలుసనీ, ఈ ప్రభుత్వాన్ని తుగ్లక్ పరిపాలన అంటూ పేరుకు మటుకు మాత్రమే విమర్శలు చేస్తారనీ, నిజానికి ఈ కిరణ్ సర్కార్‌ను కాపాడుతున్నది చంద్రబాబేననీ ఆమె విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నది చంద్రబాబేనన్నారు. ఆయనకు కానీ, ఆయన పాదయాత్రకు కానీ చిత్తశుద్ధి లేదన్నారు. 
చంద్రబాబు ఎక్కడలేని వాగ్దానాలన్నీ చేస్తున్నారనీ, పులిని చూసి నక్క వాతబెట్టుకున్నట్లు రాజశేఖర్ రెడ్డిగారు చేసి చూపించినవన్నీ చేస్తానంటున్నారని షర్మిల అవహేళన చేశారు.

విలువ లేని బాబు వాగ్దానాలు!
"రాజశేఖర్ రెడ్డిగారు రూ.12 వేల కోట్లు రుణ మాఫీ చేస్తే, ఈయన కూడా రుణమాఫీ చేస్తామంటున్నారు. ఈయనకు నిజంగా రుణమాఫీ చేసే ఉద్దేశ్యమే ఉంటే, తొమ్మిది సంవత్సరాల తన పరిపాలనలో ఎందుకు ఆ పని చేయలేదని అడిగితే సమాధానం చెప్పరు. పోనీ రుణమాఫీ చేయాల్సింది కేంద్రప్రభుత్వం కదా, మీరెలా చేస్తానంటున్నారని అడిగితే దానికీ సమాధానం చెప్పరు." అని ఆమె దుయ్యబట్టారు.
చంద్రబాబు ఇచ్చే వాగ్దానాలకి ఏ రోజూ విలువలేదని ఆమె విమర్శించారు. రెండు రూపాయల కిలో బియ్యం, పూర్తి మద్యపాన నిషేధం అన్న ఎన్టీఆర్ రెండు వాగ్దానాలను చంద్రబాబు నిలుపుకోలేదన్నారు.

అన్ని రంగాల్లోనూ విఫలం!
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మహానేత వైయస్ పథకాలన్నిటికీ తూట్లు పొడుస్తోందని షర్మిల విమర్శించారు. కుయ్ కుయ్ కుయ్ మని ఫోన్ చేసిన 20 నిమిషాలకే వచ్చే 108 జాడ ఇప్పుడు కనిపించడంలేదన్నారు. ఆరోగ్యశ్రీ కార్పొరేట్ జాబితా నుండి చాలా వ్యాధులను ప్రభుత్వం తొలగించిందన్నారు. ప్రభుత్వం ఇలా అన్ని విషయాలలోనూ విఫలమైందన్నారు. కరెంటు విషయంలోనైతే మరీ ఘోరమన్నారు. "ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి రాజశేఖర్ రెడ్డిగారు ఇచ్చి చూపించారు. రాజన్న బ్రతికుంటే రైతన్నలకు ఇప్పుడు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు వచ్చి ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రెండు మూడు గంటలు కరెంటు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. గ్రామాలలో ఇళ్లల్లోనైతే చెప్పనే అక్కరలేదు.వీళ్లేదో గొప్పగా కరెంటు ఇస్తున్నట్లు బిల్లులు మాత్రం వస్తున్నాయి. మూడు సంవత్సరాల సర్‌చార్జీ అట. వందల్లో వస్తున్నాయి కరెంటు బిల్లులు. రాజన్న ఉన్నప్పుడు రూ.70 వచ్చేది. ఇప్పుడు రూ.300 వస్తోంది. కరెంటు కోతలతో పరిశ్రమలు మూతబడి లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఈ పాపం ఈ సర్కారుది కాదా?" అని షర్మిల నిలదీశారు.
"వంటగ్యాస్ ధర రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు రూ. 305. రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఇప్పుడు దాని ధర సబ్సిడీ అయితే రూ.480. సబ్సిడీ కాకుండా ఉండే సిలిండర్ వెయ్యి రూపాయలైంది. సామాన్యుడు ఎలా బ్రతుకుతారనుకుంటున్నారు?" అని ఆమె ప్రశ్నించారు. వీటన్నిటినీ నిలదీయాల్సిన ప్రధానప్రతిపక్ష నేత చంద్రబాబు తన బాధ్యతలను పూర్తిగా విస్మరించారని అని ఆమె విమర్శించారు. చంద్రబాబు మూడేళ్ల నుండి చోద్యం చూస్తున్నారన్నారు. బాబు తన హయాంలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారని షర్మిల గుర్తు చేశారు. నాలుగువేల మంది రైతులు చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఇది మరచిపోలేని క్షమించరాని విషయమన్నారు.



 

Back to Top