ఉప్పొంగిన అభిమానం



- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు పోటెత్తిన అభిమానం
- విశాఖ న‌గ‌రంలోనే అతిపెద్ద బ‌హిరంగ‌
- చరిత్ర సృష్టించిన వైయ‌స్ జ‌గ‌న్‌
 విశాఖ‌: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో మ‌రో రికార్డు నెల‌కొంది. నిన్న విశాఖ న‌గ‌రంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు ల‌క్ష‌లాదిగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బహిరంగ సభకు జన ప్రవాహం పోటెత్తింది. కనుచూపుమేర ఇసుకేస్తే రాలనంతగా జనం పోగయ్యారు. తోసుకుంటూ వెళ్లే వాళ్లు, పరుగులు పెట్టే వాళ్లు, సభా వేదిక వద్దకు వెళ్లే మార్గాన్ని మూసేసిన పోలీసులతో గొడవకు దిగేవాళ్లు.. తమ వాహనాలు ఎటుపోతేనేం.. ఎక్కడో ఓ చోట పెట్టేసి.. వేదిక వైపు పరుగెత్తిన వాళ్లు.. అడుగడుగునా ఇలా ఆసక్తికర సన్నివేశాలెన్నో చోటుచేసుకున్నాయి. విశాఖలోని కంచరపాలేనికి నలుదిక్కులూ జనంతో కిక్కిరిశాయి. తాటిచెట్ల పాలెం రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించాయి. జ్ఞానాపురం దారిలో అడుగేయడమే కష్టమైంది. ఎన్‌ఏడీ మర్రిపాలెం రోడ్డయితే పూర్తిగా జనంతో మూసుకుపోయింది. కంచరపాలెం వంతెన రోడ్డు జనంతో నిండిపోయింది. వైయ‌స్‌ జగన్‌ బహిరంగ సభ జరిగిన కూడలికి వెళ్లే ఈ నాలుగు రోడ్లలో  ‘మేం కొన్నేళ్ల క్రితం విశాఖలో సునామీ చూశాం. మళ్లీ ఇప్పుడు జగన్‌ సభకు వచ్చిన జనాన్ని చూస్తే అలాగే అనిపిస్తోంది’ అని మర్రిపాలెం నుంచి వచ్చిన విశ్రాంత ఉద్యోగి కృష్ణమోహన్‌ అన్నారు. 


జగన్‌ ప్రసంగం ఆద్యంతం విశాఖ వాసుల వాస్తవిక జీవితాన్ని ఆవిష్కరించిందని అనేక మంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువతకు చంద్రబాబు వేసిన ఎర.. కల్పించిన భ్రమలు ఇక్కడి వాళ్లకు తెలుసు. వైయ‌స్‌ హయాంలో ఐటీ ఏ విధంగా ఉండేది.. ఇప్పుడెలా ఉందంటూ జగన్‌ లేవనెత్తిన చర్చ ప్రతీ యువకుడిని ఆలోచింపజేస్తోందని స్థానిక ఐటీ నిపుణుడు సృజన్‌ అన్నాడు. భూముల కుంభకోణం దగ్గర్నుంచి.. పేదల భూముల స్వాహ పర్వం వరకూ అధికార పార్టీ అవినీతిని వైయ‌స్ జగన్‌ కడిగిపారేశారని  గృహిణులు పల్లవీ చంద్రమోహన్, వల్లీశ్వరిలు అన్నారు. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ఓట్ల సమయంలో మాట్లాడే వాళ్లను చూశాం.. కానీ జగన్‌ ప్రసంగం వాస్తవాలకు దగ్గరగా ఉందని విశాఖ స్టీల్స్‌లో పనిచేస్తున్న రామ్మోహన్‌ వేదిక వద్ద విశ్లేషించారు. విశాఖ యావత్తు జననేతకు బ్రహ్మరథం పట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

మిద్దెలు, మేడల నిండా జనమే 
కంచరపాలెం చౌరస్తాలోని నలుదిక్కులా మిద్దెలపై జనమే జనం. మూడు, నాలుగు అంతస్తుల్లోనూ కిక్కిరిసిపోయి జగన్‌ బహిరంగ సభను తిలకించారు. కొంత మంది గోడలెక్కారు. ఇంకొందరు అందుబాటులో ఉన్న వాహనాలపైకెక్కారు. ‘మా అబ్బాయి జగనన్నను చూడాల్సిందేనని మొండి పట్టుపడ్డాడు.. వీడి కోసం ఈ గోడెక్కాం’ అని వసంతరావు అనే వ్యక్తి చెప్పాడు. జగన్‌ ప్రసంగం సాగుతున్నంతసేపు ప్రజలు వాళ్లను వాళ్లు మరిచిపోయారు. వాడి.. వేడిగా ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నప్పుడు హర్షధ్వానాలు చేశారు. విశాఖ కోసం.. యువత కోసం.. వృద్ధుల కోసం.. మహిళల కోసం.. ఇలా ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యమిస్తూ ప్రసంగిస్తున్నప్పుడు ఆయా వర్గాల వారిలో అమితానందం కనిపించింది. మేడపై నుంచి సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తే.. అభిమాన జనం చేతుల్లోని అసంఖ్యాక సెల్‌ఫోన్‌లు జగన్‌ ప్రసంగాన్ని చిత్రీకరిస్తూ కనిపించాయి.

ఎల్‌ఈడీ స్క్రీన్‌లకు అతుక్కుపోయిన జనం
కంచరపాలెం (విశాఖ ఉత్తర): ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ బహిరంగ సభను నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై నగర ప్రజలు వీక్షించారు. కంచరపాలెం మెట్టు వద్ద ఆదివారం నిర్వహించిన బహిరంగ సభకు లక్షలాది మంది తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో వైఎంసీఏ, సీఎంఆర్‌ సెంట్రల్, కంచరపాలెం బీఆర్‌టీఎస్‌ బస్టాప్, దుర్గానగర్, వివేకనందనగర్, పరమేశ్వరి థియేటర్‌ సెంటర్, ఊర్వశికూడలిలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ విశాఖ వాసులు బ్రహ్మరథం పట్టారు. లక్షల్లో పోటెత్తి తమ అభిమానాన్ని ఏకపక్షంగా చాటుకున్నారు. ఈ మహా ప్రభంజనాన్ని ఊహించని పోలీసు, కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్‌ వర్గాలు సభకొచ్చిన జనాన్ని చూసి అచ్చెరువువొందాయి. ఇంతలా భారీ సంఖ్యలో గతంలో ఏ నాయకుడికి రాలేదంటూ సభా స్థలిలోనే పలువురు బాహాటంగా చర్చించుకున్నారు. ఇది జగన్‌కు విశాఖలో దక్కిన అరుదైన ఘనతగా కూడా అభివర్ణించారు.
Back to Top