ప్రజలకు మేలు చేయాలన్న కసిని చూశా

హైదరాబాద్‌, 04 మే 2013:

త్వరలో తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని టీడీపీకి రాజీనామా చేసిన విశాఖ జిల్లా నేత దాడి వీరభద్రరావు వెల్లడించారు. శనివారం ఉదయం ఆయన చంచల్‌గుడా జైలుకు వెళ్ళారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. ఇన్నాళ్లూ తాను విన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి వేరనీ,  ఇప్పుడు తాను చూసిన శ్రీ జగన్మోహన్ రెడ్డి వేరనీ ఆయన పేర్కొన్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీ వైఖరి మేరకే తాను దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశానని ఆయన తెలిపారు. వాటిపై రెండో వైపు తెలుసుకునే అవకాశం తనకు అప్పట్లో లేదని చెప్పారు. ఇప్పుడు  వాస్తవం తెలిసిందన్నారు. అందుకే ఆ కుటుంబంతో కలిసి నడవాలనుకుంటున్నట్లు దాడి తెలిపారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరుగుతోందనీ, ఆ కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటున్నాననీ చెప్పారు. 11 నెలలుగా జైల్లో ఉన్నా శ్రీ జగన్మోహన్ రెడ్డిలో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలన్న కసి తనకు కన్పించిందని దాడి వ్యాఖ్యానించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ గతంలో తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. టీడీపీ విధానాల్లో భాగంగానే తాను విమర్శలు చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిని కలిసిన తర్వాత అనేక విషయాలు తెలిశాయనీ, త్వరలో వాటిని బహిర్గతం చేస్తాననీ దాడి వెల్లడించారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత శ్రీ జగన్ గారి ఆహ్వానం మేరకు ఆయనను కలిశానన్నారు. ఆయన్ను కలవడం ఇదే మొదటిసారన్నారు. గతంలో ఒక వివాహానికి వెళ్ళినప్పుడు తారసపడడం తప్ప ఎప్పుడు నేరుగా కలవలేదన్నారు. ప్రజలకేవిధంగా న్యాయం చేయాలీ, ఎలా మంచి చేయాలీ అనే అంశంపై శ్రీ జగన్మోహన్ రెడ్డిలో నిబద్ధత కనిపించిందని దాడి తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ళలోనూ నాకు ఏ పదవీ లేదని ఆయన చెప్పారు.

Back to Top