ప్రధాని తీరు సరికాదు: శోభా నాగిరెడ్డి

హైదరాబాద్, 20 ఏప్రిల్‌ 2013: ఢిల్లీలో ఐదేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై ప్రధాని మంత్రి కేవలం పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేయడం సరికాదని, మహిళలకు రక్షణ కావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, శాసనసభా పక్ష ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు.‌ ఇలాంటి అమానవీయ సంఘటనలపై ఫాస్టు ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి దోషులకు మరణశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచార సంఘటనలో బాధితురాలికి, ఆమె కుటుంబానికి‌ శోభా నాగిరెడ్డి సానుభూతిని వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో శనివారంనాడు ఆమె మీడియాతో మాట్లాడారు.

ఐదేళ్ళ బాలిక మీద జరిగిన లైంగిక దాడిని ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరూ ఖండించాలని శోభా నాగిరెడ్డి అన్నారు. దేశ రాజధానిలో ఇలాంటి దాడులు జరుగుతుంటే ప్రతి ఒక్కరూ తీవ్ర వేదనకు గురవుతున్నారన్నారు. నిర్భయ సంఘటనను ప్రజలు మరిచిపోక ముందే మరో చిన్నారిపై లైంగిక దాడి జరగడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మన దేశంలో, రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ పునరావృతం అవుతున్నాయని శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సంఘటనల గురించి చదివినప్పుడు, చూసినప్పుడు ప్రభుత్వం అనేది ఒకటి ఉందా? పరిపాలన కొనసాగుతోందా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

యుపిఎ అధ్యక్షురాలిగా ఒక మహిళ సోనియా గాంధీ ఉన్నారని, ఆమె అధ్యతన ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. తన కుమార్తె బయటికి వెళ్ళాలంటే భయపడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ చెప్పిన వైనాన్ని శోభా నాగిరెడ్డి ప్రస్తావించారు. ఇంతకంటే అవమానం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉందా? అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.

ఇలాంటి సంఘటనల ద్వారా భారతదేశంలో మహిళలకు రక్షణ లేదన్న సంకేతాలను పొరుగు దేశాలకు పంపిస్తున్నారా? అని కాంగ్రెస్‌ పాలకులను శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. చట్టాలను మార్చామని గొప్పగా చెప్పుకోవడం కాదని, ఆ చట్టాలను అమలు చేసే నాయకత్వం మన దేశానికి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. ఇలాంటి దుస్సంఘటన జరిగిన చోటే ఫాస్టు ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి, నెల రోజుల లోగానే కేసులను పరిష్కారం చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారకి ఉరి శిక్ష విధించాలని శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. నిర్భయ చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏ ఒక్క సంఘటననైనా నిరోధించగలిగిందా? అని ఆమె ప్రశ్నించారు. చట్టాలు చేయడంలో కన్నా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని శోభా నాగిరెడ్డి అన్నారు.

చట్టంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని ఇలాంటి మృగాలు చెలరేగిపోతున్నాయని శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి మృగాలకు భయం ఉండాలంటే.. నెల లోగానే కేసు విచారణ పూర్తిచేసి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. అలాంటి దుర్మార్గులకు 20 ఏళ్ళ శిక్ష, లేక మరణశిక్ష వేసినా ఎవరూ విచారం వ్యక్తంచేయబోరన్నారు. చట్టాలను గట్టిగా అమలు చేసినప్పుడు సమాజం హర్షిస్తుందన్నారు.

తాజా ఫోటోలు

Back to Top